Naga Vamsi: ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నంలో టాలీవుడ్ ప్రముఖులు
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:52 PM
సంధ్య థియేటర్ (sandhya theater stampede) ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు నిర్మాత నాగవంశీ అన్నారు.
సంధ్య థియేటర్ (sandhya theatre stampede) ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు నిర్మాత నాగవంశీ (Naga vamsi comments) అన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju -FDC) హైదరాబాద్‌కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తామని తెలిపారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని ఆయన అన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనతో ఉన్నట్లు చెప్పారు.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఈ మూవీ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అని అడగ్గా.. ‘ఆ నిమిషంలో జరిగే దాన్ని ఎవరూ ఆపలేరు. ఈసారి నుంచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక సినిమా ఎన్నో థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది. ప్రతిచోటా మేం ఫాలోఅప్ చేయలేం కదా.. ఒక వేళ అలా ఫాలో చేస్తామని చెప్పినా అది నమ్మేలా ఉంటుందా? మా పరిధిలో ఉన్నంతవరకూ తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇటీవల జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇకపై బెనిఫిట్ షోలు ఉంటే థియేటర్లుకు వెళ్లాలా వద్దా అనేది హీరోలు నిర్ణయించుకోవాలి’’ అని అన్నారు.
ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది కదా? దానిపై మీ సమాధానం ఏంటని అడగ్గా.. ‘‘నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నా. మరో ప్రాంతానికి ఎందుకు వెళ్తాను. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని పవన్ కల్యాణ్ అధికారంలోకి రాగానే మాటిచ్చారు. అప్పటినుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇండస్ట్రీ సరిసమానంగా చూస్తోంది. ప్రభుత్వాలు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాయి’ అని అన్నారు.