మా గీత ఆర్ట్స్ లో చేసిన హీరోయిన్స్ కి మంచి పేరొస్తుంది: బన్నీ వాస్
ABN, Publish Date - Jan 31 , 2024 | 03:20 PM
అల్లు అరవింద్ తరువాత గీత ఆర్ట్స్ సంస్థలో ముఖ్యమైన వ్యక్తి నిర్మాత బన్నీ వాస్. ఆ సంస్థ నుండి వస్తున్న ఇంకో చిన్న సినిమా 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్', ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బన్నీ వాస్ కొన్ని ఆసక్తికర మాటలు చెప్పారు
గీత ఆర్ట్స్ సంస్థ ఎందరో దర్శకులని, నిర్మాతలని చిన్న సినిమాలని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇంతకు ముందు చాలా చిన్న సినిమాలు ఆ సంస్థ నుండి విడుదలయ్యాయి, ఇప్పుడు 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమాని కూడా గీత ఆర్ట్స్ విడుదల చేస్తోంది. ఇందులో సుహాస్ కథానాయకుడు కాగా, దుశ్యంత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శివాని అనే అచ్చ తెలుగు అమ్మాయి కథానాయిక, ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న జరిగింది, అడివి శేష్ ప్రత్యేక అతిధిగా వచ్చారు. అందుకని హీరో శేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు నిర్మాత బన్నీ వాష్. 'మంచి సినిమాలు చేస్తూ తనను తాను హీరోగా నిలబెట్టుకున్నారు శేష్. యంగ్ హీరోస్ కు ఆయన్ను రోల్ మోడల్ గా చూపిస్తాను,' అని శేష్ గురించి చెప్పారు బన్నీ వాసు.
అలాగే ఈ వేడుకలో వున్న చాలా మంది ఈరోజు ఇలా స్టేజీ మీద ఉండేందుకు కారణం అల్లు అరవింద్ గారు అని చెప్పారు బన్నీ వాస్. "మా గీతా సంస్థలో ఒక రియలిస్టిక్ జెన్యూన్ మూవీ చేయలేదన్న లోటు ఈ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' తో తీరిపోయింది. ఈ సినిమాను దర్శకుడు దుశ్యంత్ ఎంతో రియలిస్టిక్ గా రూపొందించారు," అని చెప్పారు. నిర్మాత ధీరజ్ గురించి చెపుతూ, మా ధీరజ్ తన పేరుతోనే బ్యానర్ పెట్టుకున్నాడంటే ఎంతో గట్స్ ఉండాలి. అతనికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పారు.
ఇక కథానాయకురాలు శివాని గురించి మాట్లాడుతూ, 'మా సంస్థలో ఫస్ట్ మూవీ చేసిన హీరోయిన్స్ కు మంచి పేరొస్తుంది. శివానికి కూడా అలాంటి గుర్తింపు రావాలి,' అని చెప్పారు. సుహాస్ సింప్లిసిటీ, జెన్యూనిటీ ఉన్న నటుడు, అలాగే అతను మా 'తండేల్' సినిమాలో ఓ కీ రోల్ చేయాల్సింది. కానీ హీరోగా చేస్తున్నాడు మళ్లీ ఇటు అడుగువేయడం ఎందుకని నేనే వద్దన్నాను, అతన్ని చూస్తుంటే ఇరవై ఏళ్ల కింద మమ్మల్ని మేము చూసుకున్నట్లు ఉంటుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు అని సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పారు బన్నీ వాస్. ఈ 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ ఆ ఊరికి వెళ్లినట్లు ఫీల్ అవుతారు అని అన్నారు.