టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు, సమర్పకుడు అకాల మృతి

ABN, Publish Date - Nov 27 , 2024 | 04:35 PM

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంఘ సేవకులు, నటుడు, ఏవీకే ఫిలిమ్స్ అధినేత గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన సమర్పించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైన వేళ.. ఆయన అకాల మరణం అందరినీ బాధిస్తోంది. ఇంతకీ ఆ నటుడు, సమర్పకులు ఎవరంటే..

Dr Arigapudi Vijay Kumar

ప్రముఖ సంఘ సేవకులు, నటుడు, ఏవీకే ఫిలిమ్స్ అధినేత లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయకుమార్ (Dr Arigapudi Vijay Kumar) నిన్న (మంగళవారం) రాత్రి గుండెపోటుతో అకాల మరణం చెందారు. గత కొద్ది కాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అంత బాధలోనూ ఆయన సేవా కార్యక్రమాలు ఏవి ఆపలేదు. సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేస్తూనే ఉండటం ఆయన గొప్పమనసుకు నిదర్శనం. ఇటీవల లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయకుమార్ శ్రీమతి లయన్ కృష్ణకుమారి మరణించారు. ఆమె లేని లోటును ఆయన భరించలేకపోయారు. దానితో పాటు వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తోడవడంతో అకాల మరణానికి ఆయన లోనైయ్యారు.

లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా విజయ్ కుమార్ సమర్పించిన ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా నేను ఈ సమాజానికి అందిస్తున్న కానుక అని వారు పదే పదే చెబుతూ ఉండేవారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధానమైన పాత్ర కూడా చేశారు. ఇదే వారి ఆఖరి చిత్రం. ఆయన ఇక లేరన్న విషయం తెలుసుకున్న అభిమానులు, ఆయన నుండి సాయం పొందిన వారు భోరున విలపిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.


‘మంచివాళ్ళకు మంచే జరుగుతుంది అంటారు కానీ విజయకుమార్ గారికి ఎందుకో మంచి జరగలేదు’ అని ప్రముఖ సినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

‘విజయ్ కుమార్ ఇక లేరంటే నమ్మ బుద్ధి కావడం లేదు. అలాంటి మంచి మనిషిని ఇంతకు ముందు నేను చూడలేదు ఇకముందు చూడను కూడా. ఆయన నా ద్వారా ఏర్పాటు చేయించిన ఏ.పి.ఎన్ ఫౌండేషన్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత’ అని ఏ.పి.ఎన్. ఫౌండేషన్ చైర్మన్ లయన్ శ్రీరామ్ దత్తి అన్నారు.

విజయ్ కుమార్‌కు ముగ్గురు అబ్బాయిలు.. పెద్దబ్బాయి కుటుంబంతో సహా తండ్రి దగ్గరే ఉంటారు. ఇద్దరు కవల పిల్లలు ఫారెన్‌లో ఉంటారు. విదేశాల్లో ఉంటున్న కవల పిల్లలు, బంధువులు వచ్చాక శనివారం అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల శ్రేయోభిలాషుల దర్శనార్థం వారి భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని వారి స్వగృహంలో ఉంచుతున్నట్లుగా ఏపిఎన్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాపోలు దత్తాత్రి తెలిపారు.

Also Read-Pawan Kalyan: రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌కై.. నేను చేయాల్సింది చేస్తా..

Also Read-Samantha Fire: విడాకులు తీసుకుంటే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 27 , 2024 | 04:39 PM