40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిరంజీవి జీవిత చరిత్ర రాయనున్న ప్రముఖ రచయిత యండమూరి

ABN, Publish Date - Jan 20 , 2024 | 04:06 PM

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్రని రాయనున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఒక సభలో స్వయంగా ప్రకటించటం ఆసక్తికరం.

Popular writer Yandamuri is going to to write Chiranjeevi biography

మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర త్వరలో రానుంది. ఈ విషయాన్ని చిరంజీవి ప్రకటించారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ కి సాహితీ పురస్కారం అందచేసి, రెండు లక్షల రూపాయల నగదును కూడా బహూకరించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ తన జీవిత చరిత్ర రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కి అప్పగించారు. "తన ఎదుగుదలకి యండమూరి రాసిన రచనలు ఎంతో ఉపయోగపడ్డాయని, అటువంటి యండమూరి వల్లనే తనకి మెగాస్టార్ అనే బిరుదు వచ్చిందని అన్నారు. ఆయన రాసిన 'అభిలాష' నవల గురించి మొదట చెప్పింది మా అమ్మగారు. ఆ తరువాత నిర్మాత కెఎస్ రామారావు ఆ నవలని అదే పేరుతో సినిమాగా తీశారు. దానికి కోదండరామి రెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమా నా కెరీర్ ని సుస్థిర పరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడింది," అని యండమూరి గురించి చెప్పారు చిరంజీవి. ఆ తరువాత యండమూరి రాసిన ఇంకో నవల 'ఛాలెంజ్' ని కూడా సినిమాగా తెస్తే, అది అప్పటి యువకుల మీద ఎంతో ప్రభావం చూపించింది అని చెప్పారు చిరంజీవి.

"నా సినిమా కెరీర్ లో మొదట్లో ఎక్కువగా యండమూరి వీరేంద్రనాథ్ రచనలే వున్నాయి. అవి నా కెరీర్ కు ఎంతో దోహదపడ్డాయి, ఇప్పుడు అయన నా బయోగ్రఫీ రాస్తాను అనటం నాకు చాలా సంతోషంగా వుంది," అని చెప్పారు చిరంజీవి.

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు తనకు ఎప్పటినుంచో మిత్రులని, అతను తనకి గురుసమానులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ గురించి కార్యక్రమం చేస్తున్నాను అని నన్ను ఆహ్వానించగానే, రెండో ఆలోచన చేయకుండా వస్తాను అని చెప్పానని అన్నారు చిరంజీవి. "ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటివారు, వాళ్ళతో కలిసి నేను నటించటం నా అదృష్టంగా భావిస్తాను. ఎన్టీఆర్ తో 'తిరుగులేని మనిషి' సినిమా చేస్తున్నప్పుడు నేను స్వయంగా పోరాట సన్నివేశాలు చేస్తుంటే, అది చూసి ఆర్టిస్టు జీవితం చాలా విలువైనది, రిస్క్ చెయ్యకూడదు, ఏదైనా జరిగిన నిర్మాత నష్టపోతాడు అని చెప్పారు. అప్పట్లో అన్నీ నేనే చెయ్యాలని అనుకుడేవాడిని, ఆ తరువాత 'సంఘర్షణ' సినిమా టైములో గాయపడి, ఆరు నెలలు సినిమాలకి దూరంగా వున్నాను. పెద్దవాళ్ళు ఇలాంటివి ఊహించి ముందే చెప్తారు అని అప్పుడు అనుకున్నాను," అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

అలాగే ఎన్టీఆర్ విలాసవంతమైన కార్లు, వస్తువులు కొనడం కన్నా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు కొనమని సలహా ఇచ్చేవారు. "పారితోషికాలు కాకుండా అలా అప్పుడు కొనుక్కున్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలే ఈరోజు నా కుటుంబాన్ని కాపాడుతున్నాయి," అని చిరంజీవి చెప్పారు. ఏఎన్నార్ ఎంతో సరదాగా ఉండేవారని, ఆయనకున్న బలహీనతల్ని, బలంగా ఎలా మార్చుకున్నారో చెప్పేవారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

Updated Date - Jan 20 , 2024 | 04:43 PM