Pawan Kalyan Varahi Deeksha: వారాహి దీక్ష ఎందుకు చేస్తారంటే..
ABN, Publish Date - Jun 25 , 2024 | 02:03 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు.11 రోజులపాటు ఆయన దీక్షలో ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు.11 రోజులపాటు ఆయన దీక్షలో ఉంటారు. ఇందులో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. పవన్ వారాహి దీక్ష ఎందుకు చేస్తున్నారనే చర్చ మొదలైంది.
మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు ఉంటారు. ఆ సప్త మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారు అంటుంటారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో ఎనిమిది చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలు వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం.. వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో చెప్పారు. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికి తెలుసు. కానీ ఆ దేవత గురించి, దీక్ష గురించి తక్కువ మందికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం గా పదవిని చెపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు. అలాగే వారాహి అమ్మవారిని ఆరాధించటానికి ప్రత్యేక కారణాలుంటాయి.
శత్రుభయం ఉండకూడదనే కారణంతో వారాహిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవటానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారని ప్రతీతి. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు అంటే కామ క్రోధ, మద మోహ మాత్సర్యాల నుంచి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవటానికి అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. వారాహి అమ్మవారి దీక్ష జేష్ఠ మాసం చివర్లో ఆషాడ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకొని, రెండు పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో, నేలపై పడుకుంటూ, అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్షను ఆచరిస్తారు.
సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలా తొమ్మిది రోజులు కూడా చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారి దీక్ష చేపట్టినట్లు సన్నిహితుల నుంచి తెలిసింది.