Kiran Abbavaram: ‘క’ సినిమాకు తమిళనాట థియేటర్స్ దొరకలేదు.. అదండి సంగతి
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:44 PM
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. ఈ సినిమాకు తమిళ నాట థియేటర్లు దొరకలేదంటూ కిరణ్ అబ్బవరం.. తాజాగా ఈ చిత్ర పమోషన్స్లో తెలపడంతో.. తెలుగు సినిమా అభిమానులు ఫైర్ అవుతున్నారు. డబ్బింగ్ సినిమాలకు మనవాళ్లు థియేటర్లు ఇస్తున్నారు కానీ మన సినిమాలకు వాళ్లు ఎందుకు ఇవ్వరు? అంటూ ఫైర్ అవుతున్నారు.
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ అక్టోబర్ 31న కేవలం తెలుగులో మాత్రమే ఈ సినిమా విడుదలవుతున్నట్లుగా తాజాగా జరిగిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. దీంతో టాలీవుడ్ అభిమానులు గరం గరం అవుతున్నారు.
Also Read-Renu Desai: ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?
దీపావళి పండుగకి కిరణ్ అబ్బవరం సినిమాకు ఇతర భాషల్లో థియేటర్లు ఇవ్వలేదు.. మనవాళ్లేమో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ సమయంలో కూడా డబ్బింగ్ చిత్రాలను తీసుకొచ్చి వదులుతున్నారు. అదేమంటే పాన్ ఇండియా సినిమాలు, టాలీవుడ్ కాదు ఇండియన్ సినిమా అనాలి అంటూ కబుర్లు చెబుతుంటారు. మరి అలా కబుర్లు చెప్పే వారు ‘క’ సినిమాకు ఇతర భాషల్లో థియేటర్లు ఎందుకు ఇప్పించడం లేదు. ఎందుకు మన భాషని ఇతర భాషల్లో తక్కువగా చూస్తున్నారు. వారు ఉన్నంత గట్టిగా మనవాళ్లు ఎందుకు ఉండటం లేదు. తమిళ్ విషయానికి వస్తే.. అక్టోబర్ 31న కేవలం ‘అమరన్’ సినిమా మాత్రమే విడుదలవుతుంది. మరే ఇతర సినిమాలు లేవు. అదే ‘అమరన్’ సినిమా తెలుగులో డబ్ అవుతుంటే.. ఆ సినిమాకు ఇక్కడ థియేటర్లు ఇచ్చారు. ‘క’ సినిమాకు మాత్రం థియేటర్ల ఎందుకు ఇవ్వరు. దీనిపై ఇండస్ట్రీ కనీసం చర్చలైనా జరిపిందా? మన భాషని మనమే తక్కువ చేసుకుంటున్నామా? ఒకసారి సినీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరముందంటూ.. తెలుగు సినిమా ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా ‘క’ మూవీ ట్రైలర్ చాలా బాగుందంటూ రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడింది.. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. 31న కేవలం తెలుగులో మాత్రమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఒకవారం తర్వాత కన్నడ, తమిళ, మలయాళంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే తమిళనాట థియేటర్స్ దొరకలేదు, మలయాళంలో దుల్కర్గారి ‘లక్కీ భాస్కర్’ సేమ్ డేట్‌కు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఒక వారం ఆగి ‘క’ సినిమాను ఆ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మంచి సక్సెస్ చేస్తే ఆ భాషల వారు కూడా ఈ సినిమా కావాలని అడుగుతారు. అప్పుడు థియేటర్లు దొరుకుతాయని.. ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేశారు.