Naga Vamsi: క్షమించండి.. ‘దేవర’ సక్సెస్ మీట్ లేదు
ABN, Publish Date - Oct 03 , 2024 | 06:29 PM
జూ.ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.అయితే సినిమా సక్సెస్ మీట్ నిర్వహించకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
సుమారు ఆరేండ్ల గ్యాప్ తర్వాత జూ.ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు నుంచి బాగా నెగిటివిటీని మూటగట్టుకుని ఉన్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో సైతం వ్యతిరేఖతను తెచ్చుకుంది. ప్రమోషన్ కార్యక్రమాలు అంతగా నిర్వహించకపోవడం, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ కావడం అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. తీరా ఇప్పుడు సినిమా రిలీజ్ అయి విజయం సాధించినా ఎలాంటి హాడావుడి లేకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అయితే తాజాగా ఈ సక్సెస్ మీట్ విషయంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ స్పందించి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందున, తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో సినిమా విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్ నిర్వహించాలని మొండిగా ఉన్నాడు.
అయితే ఈ సక్సెస్ మీట్ నిర్వహించాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ.. దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, దేవర సినిమా విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయామని.. అది మా చేతిల్లో లేదని అన్నారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నందుకు అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామన్నారు.