మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Happy Birthday Nithiin: పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్, బస్సు డ్రైవర్ గా మహిళ

ABN, Publish Date - Mar 30 , 2024 | 11:18 AM

పవన్ కళ్యాణ్ సినిమా 'తమ్ముడు' 1999లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు నితిన్ తన అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని తన రాబోయే సినిమాకి పెట్టుకున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకుడు, దిల్ రాజు నిర్మాత

First Look of Nithiin's Thammudu

నటుడు నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అది ఎన్నిసార్లో బహిరంగంగానే వ్యక్తపరిచారు కూడా. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నితిన్ ని ఎన్నో సార్లు అభినందించారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నితిన్ తాను చేయబోయి ఒక కొత్త సినిమాకి ఏకంగా తన అభిమాన నటుడు అయిన పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా 'తమ్ముడు' 1999 లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు నితిన్ ఆ టైటిల్ నే తన సినిమాకి పెట్టుకోవం ఆసక్తికరంగా వుంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా నితిన్ కథానాయకుడిగా రాబోయే సినిమాకి 'తమ్ముడు' అని టైటిల్ పెట్టారు. ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మొదటి చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది అని చెపుతున్నారు. వేణు శ్రీరామ్ ఇంతకు ముందు 'ఎంసీఏ', 'వకీల్ సాబ్' చిత్రాలకి దర్శకత్వం వహించారు.

ఈ మొదటి చిత్రం, ఈ టైటిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనే చెప్పాలి. ఎందుకంటే పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు. అందుకని ఈ సినిమాలో కొంచెం విషయం ఉండొచ్చు అని ఈ మొదటి చిత్రం చూస్తేనే తెలిసిపోతోంది.

దర్శకుడు శ్రీరామ్ వేణు మామూలుగా తీసే చిత్రాలకి భిన్నంగా ఒక వైవిధ్యమైన కథతో ఈ సినిమాతో వస్తున్నారని, ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని ఇస్తున్నారని అనుకుంటున్నారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం ఇస్తున్న ఈ సినిమాకి, 'కాంతార', 'విరూపాక్ష' చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Updated Date - Mar 30 , 2024 | 11:27 AM