Nara Rohith: నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్.. మీరొక ఫైటర్

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:07 PM

హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు (72) శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే..

హీరో నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు (72) శనివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో నారా, నందమూరి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్రంలోని పలు సినీ, రాజకీయ ప్రముఖులు రామ్మూర్తి నాయుడుకి నివాళ్లు అర్పిస్తూ రోహిత్‌ని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయనేమన్నారంటే..


"మీరొక ఫైటర్ నాన్నా.. నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలని చెప్పారు. మీ జీవితంలో ఎన్నో కష్టాలున్నా అవి మా దరి చేరకుండా పెంచారు. నాన్నా.. మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకున్నాయి. నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.. బై నాన్నా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


వారం క్రితం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చేర్పించారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా వార్తలు వచ్చిన కాసేపటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసిన మరు క్షణమే మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ వదిలి హైదరాబాద్ AIG హాస్పిటల్‌‌కు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పర్యటనను మధ్యలోనే ఆపేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన పార్థివ దేహాన్ని నేడు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుండి రేణిగుంట విమానాశ్రయానికి తరలించనున్నారు. స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 02:59 PM