Nani: తొలి అడుగులో నేనొక ఇటుక అయితే చాలు
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:04 PM
"కెరీర్ ప్రారంభంలో నేను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అలాంటి అవార్డు అందుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు’’ అని హీరో నాని అన్నారు.
"కెరీర్ ప్రారంభంలో నేను ఎన్నో అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అలాంటి అవార్డు అందుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు’’ అని హీరో నాని అన్నారు. 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2024 (FilmFare south 2024) వేడుకలో ఆయన స్పందించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో నాని ‘దసరా’ (Dasara) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టేజి మీద అవార్డులు అందుకుంటున్న నటీనటులను చూసినప్పుడు ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్లాలని బలంగా కోరిక ఉండేది. అయితే, క్రమంగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే.. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, నటీనటులతోపాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నూతన నటీనటులు అవార్డులు తీసుకుంటే అందరితోపాటు కూర్చొని చూడాలని అనుకుంటున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డు గురించి కాదు. శ్రీకాంత్ ఓదెల (దసరా దర్శకుడు), శౌర్యువ్ (హాయ్ నాన్న దర్శకుడు) అవార్డులు అందుకుంటుంటే చూడాలని వచ్చాను. ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వారిద్దరూ అవార్డు సొంతం చేసుకోవడం.. వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు టెక్నిషియన్స్ ప్రయాణంలో నేనూ పార్ట్ అయితే అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అదే నాకు పెద్ద అవార్డు. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకమైనది’’ అని నాని అన్నారు.
కల సాకారం అయింది: వేణు
అనంతరం ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న వేణు యెల్దండి మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఎన్నో అవార్డుల ఫంక్షన్లు చూశా. మనం కూడా ఏదో ఒక రోజు తప్పకుండా స్టేజి మీదకు వెళ్లాలి. అవార్డు అందుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఫైనల్‌గా ఆరోజు నా కల సాకారం అయింది’’ అని అన్నారు.