Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:09 AM
నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం ప్రశాంత్ వర్మ పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ మేకర్స్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాలు, నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు, నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మేకర్స్ నుండి వచ్చిన ఓ సూపర్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఉబ్బి తబ్బి పోయేట్లు చేస్తుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేయనున్నారు. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనుంది. కాగా ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 5 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ #SIMBAisCOMING అనే హాష్ టాగ్ తో 'గెట్ రెడీ ఫర్ సమ్ యాక్షన్' అంటూ పోస్ట్ చేశారు.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో, వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. నందమూరి అభిమానులను మరియు సాధారణ సినీ ఔత్సాహికులను ఆకర్షించడానికి నటన, ఫైట్లు మరియు నృత్యంలో శిక్షణ సైతం తీసుకున్నాడు. అయితే.. మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ను కథానాయకుడిగా పరిచయం చేయడానికి బాలకృష్ణ కుటుంబం చాలాకాలంగా సరైన ప్రాజెక్ట్ దర్శకుడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ సామర్థ్యాన్ని గుర్తించి మోక్షజ్ఞ ఎంట్రీకి అతనే సరైన దర్శకుడిగా బాలకృష్ణ భావించి మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు.