Nandamuri Mokshagna: సూప‌ర్ హీరో నందమూరి మోక్ష‌జ్ఞ .. ఫ‌స్ట్ లుక్ అదిరింది

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:24 AM

నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు మోక్ష‌జ్ఞ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న లుక్‌ను రివీల్ చేశారు.

Nandamuri Mokshagna

చాలాకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు, నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్న స‌మ‌యం మొత్తానికి వ‌చ్చేసింది. బాలకృష్ణ తనయుడు స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా అని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు వాట‌న్నింటికి చెక్ పెడుతూ నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు మరియు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు మోక్ష‌జ్ఞ (Nandamuri Mokshagna) జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న లుక్‌ను రివీల్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేయనున్నారు. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనుంది.


ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎన్నో రోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో భారీ విజయం అందుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) రెండు రోజుల క్రితం ఓ సింహం తన పిల్లను ఎత్తుకొని చూపుతోన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది విపరీతంగా వైరల్ అవడే గాక ఇండ‌స్ట్రీలో బాగా చర్చనీయాంశం అయింది. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’ అని రాశారు. దీనికి ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీంతో మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీని ఉద్దేశించే ప్రశాంత్‌ ఈ పోస్ట్‌ పెట్టడాని అంతా డిసైడ్ అయ్యారు. దీంతో చాలామంది మోక్ష‌జ్ఞ లుక్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ పోస్టును నిజం చేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో, వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఇప్ప‌టికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. నందమూరి అభిమానులను మరియు సాధారణ సినీ ఔత్సాహికులను ఆకర్షించడానికి నటన, ఫైట్లు మరియు నృత్యంలో శిక్షణ సైతం తీసుకున్నాడు. అయితే.. మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ను కథానాయకుడిగా పరిచయం చేయడానికి బాలకృష్ణ కుటుంబం చాలాకాలంగా సరైన ప్రాజెక్ట్ మరియు దర్శకుడి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ సామర్థ్యాన్ని గుర్తించి మోక్షజ్ఞ ఎంట్రీకి అత‌నే సరైన ద‌ర్శ‌కుడిగా బాల‌కృష్ణ భావించి మోక్ష‌జ్ఞ‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ చేతిలో పెట్టాడు. ఇప్పుడు మోక్ష‌జ్ఞ లుక్ సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతోంది.

Updated Date - Sep 06 , 2024 | 11:25 AM