Balakrishna: మా మధ్య ఉన్నది ఫ్రెండ్లీ పోటీనే
ABN, Publish Date - Sep 02 , 2024 | 10:55 AM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ "నా అభిమానులకు, తోటి నటీనటులకు, నాతో కలిసి పని చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని.. ఇంతటి అభిమానం ఇచ్చిన మీ అందర్నీ ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటాను. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పటి వరకు ఎన్నో ఘనతలు దక్కాయి. ఆ ఘనతల్లో భాగంగా నేను హీరోగా 50ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ఓ విశేషంగా నిలిచింది. నాకు ఇన్నేళ్ల కెరీర్‌లో సాంఘికంగా, పౌరాణికంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అవకాశం దక్కింది. భారత చిత్రసీమలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా నా ‘ఆదిత్య 369’. నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు క్రమశిక్షణ, సమయ పాలన, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇండస్ట్రీలో నాకు.. చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), నాగార్జునకు (Nagarjuna) మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒకరికి మించి ఒకరం డ్యాన్సులు, ఫైట్లు చేయాలని తపన పడేవాళ్లం. నా కుటుంబం ఇప్పుడు చాలా పెద్దదైంది. నా ప్రేక్షకులతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, హిందూపూర్ ప్రజలు. ఇలా చాలా మంది అందులో ఉన్నారు. ఇది నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. కొత్తదనం అందిేస్త ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నేను నమ్ముతా. దానికి తగ్గట్లుగానే అలాంటి కొత్తదనం నిండిన కథల్ని నాకోసం తీసుకొస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. త్వరలో ‘అఖండ 2’ ప్రారంభించనున్నా. నేను సినీ, రాజకీయ, వైద్య రంగాల్లో ఇలా రాణిస్తున్నానంటే దానికి కారణమైన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. అలాగే నా జర్నీలో, నేను వేసే ప్రతి అడుగులో అండగా నిలిచిన నా భార్య వసుంధరకు ధన్యవాదాలు’’ అని అన్నారు.