Nag - Konda Surekha: కేటీఆర్‌ వల్ల అమ్మాయిలు ఇబ్బందిపడ్డారనే కోణంలో...

ABN, Publish Date - Nov 21 , 2024 | 04:04 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఉద్దేశపూర్వకంగా కొండా సురేఖ ఆ మాటలు మాట్లాడలేదని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు


తెలంగాణ మంత్రి కొండా సురేఖపై(Konda Surekha) నటుడు నాగార్జున (Nagarjuna) వేసిన పరువు నష్టం దావాపై (Defamation Case) నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఉద్దేశపూర్వకంగా కొండా సురేఖ ఆ మాటలు మాట్లాడలేదని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేటీఆర్‌ (KTR) వలన కొంతమంది ఆడపిల్లలు ఇబ్బందిపడ్డారనే కోణంలో సమంతను ఉదాహరించారు ఆమె అలా మాట్లాడారు తప్ప మరో కారణం లేదని న్యాయవాది తన వాదనలో పేర్కొన్నారు. పిటిషనరు వేరొకరి అభిప్రాయాలతో పిటీషన్‌ వేశారని, అది అర్హతలేని పిటీషన్‌ అని, దానిని కొట్టివేయాలని వాదనలు వినిపించారు. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేశారు.

రెండు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కౌంటర్‌ను కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్‌ సింగ్‌ దాఖలు చేశారు. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తన వాదనను వినిపించారు. ఇప్పటికే నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ుూనాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ కోరుతూ పోస్ట్‌ పెట్టారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు’’ అని ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు.  కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్‌ చర్యలకు అర్హురాలని పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని అన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:04 PM