Mrunal Thakur: బల్కంపేట.. ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న ‘సీత’
ABN, Publish Date - Mar 25 , 2024 | 06:25 AM
‘సీతారామం’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన నటి మృణాల్ ఠాకూర్. తాజాగా తను నటించిన ఫ్యామిలీస్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నిన్న మృణాల్ ఠాకూర్ సనత్ నగర్‌లోని బల్కంపేట అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
‘సీతారామం’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిన నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). మొదటి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అమ్మడికి టాలీవుడ్లో వరుసగా సినిమాలు అవకాశాలు తలుపు తడుతున్నాయి కానీ స్క్రిప్టుల ఎంపికలో మాత్రం అచీ తూచీ అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతీ సినిమా ఒప్పుకోకుండా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలను మాత్రమే చేస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టుకుంది. అందుకే అంతపెద్ద సక్సెస్ తర్వాత ఆమె నానితో హయ్ నాన్న మాత్రమే చేయగా తాజాగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ఫ్యామిలీ స్టార్ (Family Star) అనే మరో కుటుంబ కథా చిత్రం చేస్తోంది.
ఇప్పుడు ఆ ఫ్యామిలీస్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సనత్ నగర్‌లోని బల్కంపేట అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం మీడియాలకు ఇంటర్వూలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మృణాల్ మాట్లాడుతూ కొత్త పని ప్రారంభించే ముందు దేవతలను, ఆలయాలన్ని సందర్శించాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుంటారని, నేను దానిని తూచా తప్పకుండా అవలంభిస్తు వస్తున్నానని పేర్కొంది.
ఈ రోజు నుంచి ఫ్యామిలీ స్టార్ (Family Star) సనిమా ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నామని, ఆ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపింది.
ఇదిలాఉండగా ఫ్యామిలీ స్టార్ (Family Star)సినిమాకు పరశురాం (Parasuram) దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మించారు, గోపీ సుందర్ సంగీతం అందించారు. ఏప్రిల్ 5న (FamilyStarOnApril5th) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.