Dear Krishna: ఎస్పీబీ చివరి తెలుగు పాట.. రిలీజ్ చేసిన మోహన్ లాల్
ABN, Publish Date - Oct 24 , 2024 | 07:53 PM
దేశం గర్వించదగ్గ గాయకుడు గాన గంధర్వుడు లెజండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి సారిగా డియర్ కృష్ణ అనే సినిమాలో పాడిన పాటను బురువారం మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ రిలీజ్ చేశారు.
అక్షయ్ కృష్ణన్ (Akshay Krishnan), మమితా బైజు (Mamitha Baiju), ఐశ్వర్య (Ashwaria Ullas) కాంబినేషన్‌లో మలయాళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్‌గా రూపొందుతున్న చిత్రం డియర్ కృష్ణ. ఈ ఏడాది ప్రారంభంలో ప్రేమలు సినిమాతో కుర్రకారు కలల రాణిగా అవతరించిన మమితా బైజు ఈ సినిమాతో స్ట్రెయిట్‌గా తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది. పిఎన్‌బి సినిమాస్ బ్యానర్‌పై పిఎన్ బలరామ్ ((PN Balaram) ఈ సినిమాను నిర్మించడంతో పాటు రచయితగా వ్యవహరిస్తున్నాడు.గతంలో తెలుగులో పాప కోసం, భలే మొగుడు భలే పెళ్లాం వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దినేశ్ బాబు (Dinesh Baboo) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు డైలాగ్స్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రాఫర్ బాధ్యలు నిర్వహిస్తున్నాడు. హరి ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో నటిస్తోన్న అక్షయ్ అనే యువకుడి నిజ జీవితంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుండడం విశేషం.
ఎప్పుడో ఐదేండ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవల దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఇటీవల మేకర్స్‌సినిమా ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. త్వరలో థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో పాటు అనారోగ్య సమస్యలతో విషమ పరిస్థితుల్లో ఉన్న యువకుడు తను అమితంగా ఆరాధించే శ్రీకృష్ణునిపై భారం వేస్తాడు.. డాక్టర్లు కూడా ఏం చేయలేమన్న పరిస్థితుల్లో జరిగిన ఓ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరక్కిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని కథ, స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ఉంటుందని ఆ భగవంతుడు శ్రీ కృష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్ బలరామ్ (PN Balaram) చెప్పుకొచ్చారు.
అయితే దేశం గర్వించదగ్గ గాయకుడు గాన గంధర్వుడు లెజండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) చివరి సారిగా తెలుగులో పాడిన పాట ఈ సినిమాలోదే కావడం విశేషం. ఈ పాటకు హరిప్రసాధ్ సంగీతం, గిరిభట్ల రాసిన సాహిత్యం అందించారు. చిరుప్రాయం (Chiru Prayam) అంటూ బాలుగారి గాత్రం నుంచి వచ్చిన ఈ పాట అమృతంలా సాగుతూ మనకు ప్రతి ఒక్కరికి ఎస్పీబీ గారి గొంతులోని మాధుర్యాన్ని గుర్తు చేయడంతో పాటు ఆయనను తలుచుకుని కంటనీరు వచ్చేలా చేస్తోంది. తాజాగా ఈ పాటను మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తన వాయిస్‌లో సినిమా గురించి చెప్పి పాటను విడుదల చేయడం గమనార్హం. మీరూ ఇప్పుడే ఆ పాట విని మరోసారి ఆ గార గంధర్వున్ని తలుచుకోండి.