Mohan Babu: చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ మోహన్ బాబు పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే
ABN, Publish Date - Dec 20 , 2024 | 09:43 PM
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య కొన్నాళ్లుగా అంటే ఆ మధ్య ‘మా’ ఎన్నికలు జరిగినప్పటి నుండి సరైన సంబంధాలు లేవనేలా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే.. మరి ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి పేరు మోహన్ బాబు ప్రస్తావించారంటే.. మ్యాటర్ లేకుండా ఎలా ఉంటుంది? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో ఎలా వార్తల్లో నిలుస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మంచు మనోజ్ విషయంలో ఫ్యామిలీ అంతా సీరియస్‌గా ఉండటంతో.. ఆ ఫ్యామిలీ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. మంచు హీరోలకు పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారంటే.. ఆ ఫ్యామిలీలో ఇష్యూస్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ గొడవల్లో రీసెంట్‌గా ఓ జర్నలిస్ట్‌పై మోహన్ బాబు చేయి చేసుకోవడంతో.. ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు నిమిత్తం ఆయన మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు ఇంట్లో గొడవలు జరుగుతున్నా.. మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ మ్యాటర్‌లోకి వస్తే..
Also Read- Vidudala Part2: విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’ ఎలా ఉందంటే..
మోహన్ బాబు నటుడిగా 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఆయన నటించిన సినిమాలలో, ఆయనకు ఎంతో పేరు తెచ్చిన కొన్ని పాత్రలను సోషల్ మీడియా వేదికగా రీవైండ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలా ‘యమ్ ధర్మరాజు MA’, ‘దేవత’, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘సర్దార్ పాపారాయుడు’, ‘కోరికలే గుర్రాలైతే’, ‘శ్రీరాములయ్య’, ‘ప్రతిజ్ఞ’, ‘కేటుగాడు’, ‘శివరంజని’, ‘కలెక్టర్‌గారు’ వంటి సినిమాలలోని ఐకానిక్ సీన్లను పోస్ట్ చేసి వాటి వివరాలను చెప్పుకొచ్చిన మోహన్ బాబు.. తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఆయన నటించిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రంలోనిది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా గురించి మోహన్ బాబు చెబుతూ..
‘‘నా సినీ ప్రయాణంలో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర, ముఖ్యంగా నా స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నేను ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలలో ఇదీ ఒకటి’’ అని తెలిపారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా విషయానికి వస్తే.. ఇందులో రాధిక, గీత హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి, మోహన్ బాబు భార్యలైన రాధిక, గీతలు.. పల్లెటూరి జీవితం నచ్చక పట్నం వెళదామని భర్తలను సతాయిస్తూ ఉంటారు. భర్తలు వద్దని చెప్పడంతో.. వారికి తెలియకుండా పట్నం వెళ్లిన ఆ ఇద్దరూ ఎలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ సమస్యల నుండి ఎలా వారు బయటపడ్డారు? అనే కథాంశంతో దర్శకుడు మౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.