Mohan Babu: జర్నలిస్ట్‌పై దాడి.. క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు..

ABN, Publish Date - Dec 12 , 2024 | 06:18 PM

జర్నలిస్ట్‌పై చేసిన దాడిపై క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు. తాజాగా పది నిమిషాల ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

గత కొన్నిరోజులుగా తెలుగు మీడియాలో సంచలనం సృష్టిస్తున్న మంచు ఫ్యామిలీ ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఓ జర్నలిస్ట్ పై మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా ఆయన ఈ ఘటనపై ఆడియో సందేశం రిలీజ్ చేశారు.


మోహన్ బాబు మాట్లాడుతూ.. జర్నలిస్టులను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదన్నారు. మొదట తాను జర్నలిస్టుకు నమస్కారం పెట్టానని, అయినా అతను తన వద్ద మైక్ పెట్టారని తెలిపారు. ఆ మైక్ తన కన్నుకు తగలబోయిందని, తృటిలో తాను తప్పించుకున్నట్లు చెప్పారు. విజయవాడలో తాను ఒకపప్పుడు ఉద్యోగినేనని గుర్తు చేశారు. తన ఇంటికి వచ్చినవారు మీడియా వారా వేరే వారు ఎవరైనా వచ్చారా అనే విషయం తనకు తెలియదన్నారు. జరిగిన సంఘటనకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని, ఆ జర్నలిస్టు తనకు తమ్ముడులాంటి వారన్నారు. అన్ని విషయాలను పైన భగవంతుడు చూస్తున్నారని మోహన్ బాబు తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, తాను చేసిన మంచి పనులను ఎవరూ అర్థం చేసుకోవడంలేదన్నారు. జర్నలిస్టులను కొట్టడం మాత్రం తప్పే అయినప్పటికీ.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలని మోహన్‌బాబు తన ఆడియో సందేశంలో పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదన్నారు. మైకులు లాక్కుని కొట్టేంత మూర్ఖుడిని తాను కాదన్నారు. పోలీసులంటే తనకు ఎంతో ఇష్టమని, వారు శాంతి భద్రతలను కాపాడాలన్నారు. కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని మోహన్‌బాబు తెలిపారు. ఇది న్యాయమా.. అన్యాయమా అనేది ఆలోచించాలన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 06:30 PM