Mohan Babu: ఎవరూ ఊహించని విధంగా.. మోహన్ బాబు క్షమాపణ
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:24 AM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే మోహన్ బాబు ఇంట్లో కొన్ని రోజులుగా ఎటువంటి రచ్చ జరుగుతుందో తెలిసిందే. అయితే ఈ గొడవలో ఆయన ఓ జర్నలిస్ట్‌పై చేయి చేసుకున్నారు. అందుకుగానూ ఆయన క్షమాపణలు కోరుతూ.. ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ విడుదల చేశారు. విషయం ఏమిటంటే..
మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారు పేరు. ఎంతో మందిని ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎందరికో జీవనాధారం ఇచ్చారు. కొంచెం కోపం ఎక్కువనే కానీ.. మనసు మాత్రం చాలా గొప్పదని ఆయనతో నటించిన ప్రతి ఒక్కరూ చెప్పేమాట. ఆ కోపం కూడా పని పట్ల నిబద్దత లేని వారిపైనే. అలాంటి మోహన్ బాబు ఇంట్లో ప్రస్తుతం క్రమశిక్షణ లోపించింది. కొన్ని రోజులుగా వార్తలలో నిలిచిన ఆయన కుటుంబ గొడవలు ఆయన ఫ్రస్ట్రేషన్‌కి కారణమయ్యాయి. ఇలాంటివి కేవలం ఆయన ఇంట్లోనేనా? అంటే ప్రతి ఇంట్లో ఉండేవే. కాకపోతే సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఇలా వార్తలలో హైలెట్ అవ్వాల్సి వచ్చింది. ఓ జర్నలిస్ట్‌పై ఆయన చేయి చేసుకోవాల్సి వచ్చింది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ అమెరికా ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా.. ‘పుష్ప’
మరి మొన్న జరిగిన సంఘటనలో ఎవరిది తప్పు ఉంది? అనేది పక్కన పెడితే.. మోహన్ బాబు తను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. మీడియాకు మోహన్ బాబు ఎప్పుడూ ఎంతో గౌరవం ఇస్తారు. కానీ పర్సనల్‌గా ఇంట్లో కెమెరా పెట్టేస్తానంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. అందుకే కంట్రోల్ తప్పారు. జర్నలిస్ట్‌పై చేయి చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో మోహన్ బాబుకే ఎక్కువ సపోర్ట్ లభించింది. ‘‘అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా కాస్త చూసుకోవాలి.. వాళ్ల ఫ్యామిలీకి కాస్త ప్రైవసీ ఇచ్చి ఉండాల్సింది’’ అంటూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఏది ఏమైనా.. తను చేసింది తప్పని మోహన్ బాబు గాయపడ్డ జర్నలిస్ట్‌కి, వాళ్ల కుటుంబానికి క్షమాపణలు చెబుతూ.. ఓ లెటర్‌ని ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేసి.. నేనూ మనిషినే అని చాటారు.
అయితే మోహన్ బాబు తప్పు చేశారు.. సారీ చెప్పారు. మరి, ఆయన ఇంటిపై, ఇంటిలో జరిగిన గొడవలపై రకరకాలుగా వార్తలు ప్రసారం చేసిన.. మరీ ముఖ్యంగా ‘మనిషివా, మోహన్ బాబువా’ అని కథనాలను ప్రసారం చేసిన వారు కూడా సారీ చెప్పాలిగా.. అంటూ నెటిజన్లు కొందరు మోహన్ బాబు ట్వీట్‌కు రియాక్ట్ అవుతుండటం గమనార్హం. నిజమేగా మరి.. ఆయన స్టార్ అనేది పక్కన పెడితే.. ఆయన వయసు దాదాపు 70 ఏళ్లకు పైనే. ఇంట్లో కొడుకు వల్ల పరువు పోతుందని మనస్తాపంలో ఉన్న వ్యక్తిని మరింత కృంగదీసేలా కాకుండా.. కాస్త గౌరవప్రదంగా మీడియా వ్యవహరించి ఉండాల్సింది. వాళ్ల ఇంట్లో సమస్యలు వారే పరిష్కరించుకునే వారు. ఈ గొడవల్లో ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే.. అప్పుడు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేసేవారా? న్యూస్ కవర్ చేయండి.. న్యూసెన్స్‌ని కాదు.. అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో మోహన్ బాబు పోస్ట్ వైరల్ అవుతోంది.
మోహన్ బాబు సారీతో సద్దుమణిగినట్లేనా..
ఇది మా ఇంటి గొడవ.. మేమే పరిష్కరించుకుంటాం అంటూ మోహన్ బాబు చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరించి.. ఇకపై ఈ విషయాన్ని పబ్లిక్ కాకుండా బ్రేక్ వేశారు. ఇది ముందే ఆయన చెప్పి ఉంటే.. మీడియా కూడా అంత ఇన్వాల్వ్ అయ్యేది కాదు. ఏదయితేనేం.. ఆయన చెప్పిన సారీతో దాదాపు ఈ గొడవ సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు.