Chiranjeevi: ‘జీబ్రా’కి మెగాస్టార్ ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా..
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:37 PM
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. ‘జీబ్రా మెగా ఈవెంట్’ పేరుతో మంగళవారం గ్రాండ్‌గా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మెగాస్టార్ ఏమన్నారంటే..
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మేకర్స్ నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ కోసం ‘జీబ్రా మెగా ఈవెంట్’ అంటూ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్ విడుదల చేయడంతో పాటు.. సినిమాకు ట్యాగ్‌లైన్ కూడా మెగాస్టార్‌తో పెట్టించడం విశేషం. ఇంతకీ చిరు ఇచ్చిన ట్యాగ్‌లైన్ ఏమిటంటే.. ‘సూపర్ హిట్ బొమ్మ’. ‘జీబ్రా’ సూపర్ హిట్ బొమ్మ అంటూ మెగాస్టార్ చెప్పడంతో.. వేదిక కరతాళ ధ్వనులతో నిండిపోయింది.
Also Read-Devaki Nandana Vasudeva: మంచి, చెడుల మధ్య యుద్ధం.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ఇక ఈ మెగా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘కొన్ని ఫంక్షన్స్‌కి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రేమతో పిలిస్తే వస్తాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. ఈ స్టేజ్‌పై నాకు ఆ ప్రేమ, అభిమానం మెండుగా లభిస్తుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అంత ప్రేమ అభిమానం కురిపిస్తుంటే అది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మీ అందరికీ నా అభినందనలు. కోవిడ్ సమయంలో ఎలాంటి సినిమాలు తీసి జనాలని రంజింపచేయాలనే ఒక మీమాంస ఇండస్ట్రీలో నెలకొంది. జనాలు ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటు చేసుకున్న తర్వాత, పెద్ద సినిమాలకు, బిగ్ ఈవెంట్ సినిమాలు తప్పితే వాళ్ళని థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమైనప్పుడు ఇండస్ట్రీకి ఇదేం కష్టకాలం అనిపించింది. పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది ఇండస్ట్రీ కాదు, ఇక్కడ అన్ని సినిమాలు ఆడాలి, షూటింగ్ లు జరుపుకోవాలని, ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరూ కళకళలాడాలి, అప్పుడే పరిశ్రమ సజావుగా కొనసాగుతూ ఉంటుందనే నాలాంటి వాళ్లకు ఒక చిన్న బెరుకు వచ్చింది. అయితే అవన్నీ కూడా కరెక్ట్ కాదని ప్రేక్షకులు నిరూపించారు. దానికి ఉదాహరణగా ఈ సంవత్సరం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలయికలో వచ్చిన ‘హనుమాన్’. ఈ సినిమాతో ఈ సంవత్సరం శుభారంభమైంది. అది ఆల్ ఇండియా సినిమాగా గొప్ప విజయం సాధించింది. చిన్న సినిమాలని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. తర్వాత వచ్చిన ‘కమిటీ కుర్రాళ్ళు, డిజె టిల్లు, ఆయ్, మత్తువదలరా 2’తో పాటు ఈ దీపావళికి వచ్చిన ‘లక్కీ భాస్కర్, క, అమరన్’ ఎంతగానో ఆదరణ దక్కించుకున్నాయి. చిన్న, పెద్ద సినిమా అని కాదు.. ఈరోజు కంటెంట్ అనేది ఆయుపట్టు. కంటెంట్ బాగుండాలి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అది ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సినిమాలు ఆడవు ప్రేక్షకులు ఓటీటికి అలవాటు పడిపోయారనే మాట అవాస్తవం. సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు. సినిమాని వాళ్ళకి మెప్పించేలా మనం చాకచక్యంగా తీయాలి.
‘జీబ్రా’ ట్రైలర్ చూసినప్పుడు మంచి కంటెంట్‌తో ఈ సినిమా వస్తుందని అర్థమైంది. ఇందులో చాలా మంచి ఎంటర్టైన్మెంట్, స్టార్ కాస్ట్ ఉంది. వండర్ ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా ‘సూపర్ హిట్ బొమ్మ’ అవుతుంది. ఇందులో సత్య, ధనుంజయ, సత్యరాజ్ ఇలా చాలా మంచి నటులు ఉన్నారు. డాలీ తెలుగులో మంచి నటుడుగా స్థిరపడతాడని నమ్మకం ఉంది. సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు. తను చూపించే ప్రేమలో ఎక్కడా కల్మషం ఉండదు. నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను చెప్పినవన్నీ సత్యాలు. తన సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఇంటెన్స్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. తన వాయిస్‌లో రిచ్‌నెస్ వుంది. తను నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసినప్పుడు నేను తెలుగు యాక్టర్ అనుకోలేదు. కానీ తను మన వైజాగ్ అబ్బాయి అని తెలిసినప్పుడు తనతో మాట్లాడాలనుకున్నాను. అప్పుడు కరోనా టైమ్. అయినా కూడా ఇంటికి పిలిపించుకుని అభినందించాను. అప్పుడే తనకి నేనంటే ఎంత ఇష్టమో చెప్పాడు. చెప్పడమే కాదు.. చూపించాడు కూడా. అప్పటి నుంచి మేము అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. తను చాలా మంచి యాక్టర్. అయితే తనకి సరైన సినిమాలు పడటం లేదనిపించేది.
‘గాడ్ ఫాదర్’ సినిమాలో విలన్ రోల్లో తను అత్యద్భుతంగా చేస్తాడని నాకు నమ్మకం. నేను నమ్మకం పెట్టుకున్నట్లే ఆ సినిమాలో తను అద్భుతంగా రాణించాడు. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తనకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ‘జీబ్రా’లో తను చాలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తనకి మరింత బ్రైట్ ఫ్యూచర్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. తమ్ముడు సత్యదేవ్‌కి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. నిర్మాతలు బాల, దినేష్, ఎస్ ఎన్ రెడ్డి చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ ‘పెంగ్విన్’ సినిమా చూశాను. చాలా వండర్‌ఫుల్‌గా ఈ సినిమాను తీశారు. టీమ్ అందరికీ ఈ సినిమా అద్భుతమైన విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. టీమ్‌లో ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్’’ అని చెప్పుకొచ్చారు.