Chiranjeevi: అక్కినేని అవార్డుతో.. ఇన్నాళ్ల‌కు ఇంట గెలిచా

ABN, Publish Date - Oct 28 , 2024 | 09:13 PM

నాడు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా.. అక్కినేని అవార్డుతో ఇన్నాళ్ల‌కు ఇంట గెలిచాన‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సోమ‌వారం ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ అవార్డు ప్ర‌ధానోత్స‌వ‌ వేడుక ఈ రోజు ( అన్నపూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగింది.

chiranjeevi

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్‌ఆర్‌ అవార్డు’ (ANR National Award 2024)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు ప్ర‌ధానోత్స‌వ‌ వేడుక ఈ రోజు (సోమ‌వారం) అన్నపూర్ణ స్టూడియోలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan) ముఖ్య అతిథిగా హ‌జ‌రై చిరంజీవికి అవార్డు ప్రదానం చేశారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి భావోద్వేగానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కానీ నేను నా సినీ ప్రస్థానంలో మొద‌ట బ‌య‌టే గెలిచాన‌ని ఇప్పుడు ఇంట గెలిచాన‌ని అన్నారు. కొంత కాలం క్రితమే ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది నాడు నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా అయున‌ట్లు భావించా.. కానీ దాన్ని కొందరు హర్షించలేదు. దాంతో ఆ అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. ఆరోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. ఇప్పుడు పద్మవిభూషణ్‌ సహా ఎన్ని అవార్డులు వ‌చ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉండేద‌ని ఇప్పుడు ఈ Anr అవార్డు రావ‌డంతో నా సినీ జీవితానికి ప‌రిపూర్ణ‌త చేకూరిన‌ట్లైంద‌ని అన్నారు.


ఈ వేడుక‌కు టాలీవుడ్ తారాలోక‌మంతా ఈ త‌ర‌లిరాగా అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య (Naga Chaitanya), అఖిల్ ద‌గ్గ‌రుండి అతిథుల‌ను ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా కీర‌వాణి సార‌థ్యంలో ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం అక్కినేని నాగేశ్వ‌ర రావు చివ‌ర‌గా మ‌ట్లాడిన మాట‌ల‌ను, అంతిమ యాత్ర‌ల‌ను ప్లే చేయ‌గా అక్క‌డికి వ‌చ్చిన అతిథులంద‌రి చేత కంట‌త‌డి పెట్టించాయి. ఆపై నాగార్జున‌, అమితాబ్‌, చిరంజీవి మ‌ట్లాడుతూ అక్కినేని సేవ‌ల‌ను కొనియాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, అల్లు అర‌వింద్‌, వెంక‌టేశ్‌, రామ్ చ‌ర‌ణ్‌, నాని, సుధీర్ బాబు, ర‌మ్య‌కృష్ణ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు కె. రాఘవేంద్రరావు,బోయ‌పాటి శ్రీనివాస్‌, నాగ్ ఆశ్విన్‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, శోభిత దూళిపాళ్ల‌, మురళీమోహన్, కె.ఎస్ రామారావు, బ్ర‌హ్మానందం, అశ్వినీద‌త్‌, కీర‌వాణి దంప‌తులు, ఆది శేష‌గిరి రావు, మ‌హా న‌టి సావిత్రి కూతురు విజ‌య చాముండేశ్వ‌రి, వరప్రసాద్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, నందమూరి రామకృష్ణ, ప్రకాష్ రాజ్, వైవిఎస్ చౌదరి, అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 09:13 PM