Mega Star: విహారానికి అమెరికా వెళుతున్న చిరంజీవి దంపతులు
ABN, Publish Date - Feb 14 , 2024 | 11:06 AM
రెండు వారాలపాటు 'విశ్వంభర' సినిమా కోసం షూటింగ్ చేసి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ కోసం తన భార్య సురేఖతో అమెరికా వెళుతున్నారు మెగా స్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి రెండు వారాలపాటు 'విశ్వంభర' సినిమా షూటింగ్ చేసి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు. హాలిడే కోసం అమెరికా వెళుతున్నారు. తిరిగి రాగానే 'విశ్వంభర' సినిమా షూటింగ్ మొదలు పెడతాను అని చెప్పారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమైన 'ఎక్స్' లో ఈ విషయాన్నీ తన అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.
అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు. తన భార్య సురేఖతో ఒక చిన్న హాలిడే ట్రిప్ కి అమెరికా వెళుతున్నాను అని అందులో పేర్కొన్నారు చిరంజీవి. 'విశ్వంభర' సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకుడు కాగా 18 ఏళ్ల తరువాత త్రిష ఈ సినిమాలో మళ్ళీ చిరంజీవి పక్కన కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే చిరంజీవి మాత్రం ఫిబ్రవరి 1వ తేదీనుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ రెండు వారాల్లో చాలా ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఇందులో రానా దగ్గుబాటి విలన్ గా నటించాల్సి వుంది, కానీ అతను ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. అతనికి బదులుగా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ని తెచ్చారు, అతనితో షూటింగ్ కూడా కొంత చిత్రీకరించినట్టుగా తెలిసింది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి నిర్మాతలు.