Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?
ABN, Publish Date - Dec 08 , 2024 | 06:10 PM
మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? నిజంగా ఆస్తుల కోసమే దాడులు జరుగుతున్నాయా? ఒక వైపు మంచు మనోజ్ హాస్పిటల్ అంటూ హడావుడి చేస్తుంటే.. మరోవైపు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో సండే టాలీవుడ్‌ని ఈ ఫ్యామిలీ ‘మంచు’లా కమ్మేసింది. అసలింతకీ విషయం ఏమిటంటే...
ఆదివారం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా షాక్‌కి గురైంది. మంచు ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా ఓ షాకింగ్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసింది. మంచు మోహన్ బాబు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య దాడి జరిగిందని, ఈ దాడిలో మోహన్ బాబు తన అనుచరులతో మనోజ్‌పై దాడి చేయించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ కాసేపటికే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరపు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలా ఓ వార్త వచ్చింది. కానీ, మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా ముందు ప్రకటించడమే కాకుండా.. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు మంచు మనోజ్ నుండి 100కు కాల్ వచ్చినట్లుగా పోలీసులు కూడా ధ్రువీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో మంచు ఫ్యామిలీలో మంటలు నిజమే అనేది క్లారిటీ వచ్చేసింది.
Also Read- Manchu Manoj: హాస్పిటల్‌కు మంచు మనోజ్.. కాళ్లకు బలమైన గాయాలు
అయితే ఇక్కడ మంచు మనోజ్ హడావుడి చేస్తున్నాడు తప్పితే.. మోహన్ బాబు సైడ్ నుండి కొంచెం అంటే కొంచెం కూడా కదలిక లేదు. పైగా ఈ సమయంలో ట్విట్టర్ ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్ చూస్తే.. ఆయనసలు ఈ విషయాన్ని పట్టించుకున్నట్టే కనిపించలేదు. మరోవైపు మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి మోహన్ బాబు అనుచరుడైన వినయ్ కొంత మందితో వచ్చి.. తనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న టిఎక్స్ హాస్పిటల్‌లో మనోజ్ జాయిన్ అయ్యారు. తన భార్య, టీమ్‌తో కలిసి మనోజ్ హాస్పిటల్‌కు వెళుతున్న వీడియో బయటికి రావడంతో.. నిజంగానే మనోజ్‌పై దాడి జరిగి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంచు మనోజ్ రచ్చ ఇలా ఉంటే.. మోహన్ బాబు మాత్రం తాపీగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు వేస్తున్నారు.
మంచు మోహన్ బాబు తాజాగా తన ట్విట్టర్ ఎక్స్‌లో 1979లో ఆయన నటించిన ‘కోరికలే గుర్రాలైతే’ అనే మూవీలోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసి.. ‘‘కోరికలే గుర్రాలైతే(1979) మూవీలోని సన్నివేశం. నా గురువు, లెజెండరీ శ్రీ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మాత శ్రీ. జి. జగదీష్ చంద్ర ప్రసాద్ గారు నిర్మించారు. ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయి. ఇందులో చంద్రమోహన్ మరియు మురళీ మోహన్ గార్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు మరింత గుర్తుండిపోయే అంశం. అలాగే తొలిసారి యమధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం నాకు సవాలుగానూ మరియు సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా నిలిచింది’’ అని పేర్కొన్నారు.
Also Read-Breaking News: మంచు ఫ్యామిలీలో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ మనోజ్
ఇది చూసిన వారంతా బయట అంత గొడవ జరుగుతూ.. పరువు పోయే పరిస్థితులు నెలకొంటే.. మోహన్ బాబు ఏంటి ఇలా చేస్తున్నారు? అంటే ఆయనకేం తెలియదా? ఇదంతా మనోజ్ క్రియేట్ చేస్తున్నదేనా? అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదయితేనేం.. సండే మొత్తం టాలీవుడ్‌ని ఈ ఫ్యామిలీ ‘మంచు’లా కమ్మేసిందన్నది మాత్రం నిజం.