Vaddepalli Krishna: గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:43 PM

ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (Vaddepalli krishna -76) కన్నుమూశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు


ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ (Vaddepalli krishna -76) కన్నుమూశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఆయన తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్‌ నాగోల్‌లో స్థిరపడ్డారు. తొలుత పోస్టుమెన్‌ ఉద్యోగం చేశారు. 'పిల్ల జమీందార్‌' చిత్రంలో ‘నీ చూపులోన విరజాజి వాన’, 'భైరవ ద్వీపం' చిత్రంలో అంబా శాంభవి లాంటి ఆణిముత్యాల్లాంటి పాటలను రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించగా అన్ని వేదికలపైనా ఆ నృత్య రూపకం మార్మోగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు వడ్డేపల్లి(vaddepalli krishna is nomore)

దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్‌ హీరోగా నటించారు. బలగం సినిమాలో  స్వయంగా నటించారు. ఆయన దర్శకత్వం వహించి నిర్మించిన గోభాగ్యం షార్ట్‌ ఫిల్మ్‌కి అంతర్జాతీయంగా పలు పురస్కారాలు దక్కాయి. సి. నారాయణ రెడ్డి ఏంటో ఇష్టపడే వ్యక్తి  రచయిత వడ్డేపల్లి కృష్ణ. బతుకమ్మ, రామప్ప రమణీయం లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు. పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆయన రాసిన వందల్లో లలిత గీతాలను ఆకాశవాణి, దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. 40కి పైగా నృత్య రూపకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. వడ్డేపల్లి కృష్ణ మరణం పట్ల సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

Updated Date - Sep 06 , 2024 | 01:43 PM