Lavanya Tripati: నాకు ఎవరు హద్దులు గీయలేదు.. స్వేచ్ఛగా ఉన్నా
ABN, Publish Date - Feb 03 , 2024 | 04:39 PM
పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు రాలేదు. మెగా కుటుంబంలోకి కోడలిగా వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలి అని నాకు ఎవరూ పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది’’ అని లావణ్యా త్రిపాఠీ అన్నారు.
‘‘పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఎలాంటి మార్పులు రాలేదు. మెగా కుటుంబంలోకి కోడలిగా వచ్చావు కాబట్టి నువ్వు ఇలా చేయాలి.. అలా చేయాలి అని నాకు ఎవరూ పరిమితులు పెట్టడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది’’ అని లావణ్యా త్రిపాఠీ అన్నారు. తాజాగా ఆమె ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్‌సిరీస్‌తో అలరించేందుకు సిద్థమయ్యారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సుప్రియ నిర్మించారు. అభిజీత్ కథానాయకుడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో శుక్రవారం విడుదలైన సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడారు.
సినిమాల ఎంపికలో నేనెప్పుడూ ఆచితూచి అడుగేస్తూనే ఉన్నా. హీరోయినగా ఎక్కువ చిత్రాలు చేసేయాలని పరుగుతు తీయడం లేదు. చేేసవి కొన్ని చిత్రాలైనా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నించా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నాకలాంటి గుర్తింపునే తీసుకొచ్చాయి అన్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే వరుణ్‌తేజ్ రూపంలో బాగా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికాడు. ఇంతకంటే ఏం కావాలి. గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాం. నా ప్రాజెక్ట్స్ విషయంలో వరుణ్ పెద్దగా కలగజేసుకోడు. ఎప్పుడైనా నేను ఎంచుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడు. ‘ప్రస్తుతం నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తున్నాను. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. అందులో నేను పోలీసు అధికారిణిగా కనిపిస్తారు. అలాగే తమిళంలో ఓ చిత్రం చేస్తున్నాను.
‘‘మిస్ పర్ఫెక్ట్ వినోదాత్మకంగా సాగే సిరీస్. వినోదం.. రొమాంటిక్ అంశాలు చక్కగా మిళితమై ఉన్న అందమైన కథ ఇది. రెగ్యులర్ కామెడీ ఉండదు పాత్రలు చాలా భిన్నంగా కనిపిస్తాయి. ఇందులో లావణ్య, లక్ష్మి అనే రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా. లావణ్య చాలా పర్ఫెక్షనిస్ట్. అయితే తనలోని ఆ వ్యక్తిత్వం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటి? వాటి నుంచి తనెలా బయట పడింది అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాలి’’.
ఇందులో పాత్రలు నా నిజ జీవితానికి కాస్త దగ్గరగా ఉంటాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మిలాగే ఉంటా. సెట్లో లావణ్య పాత్రలా పర్ఫెక్షన్ కోరుకుంటా. సన్నివేశం బాగా వచ్చే వరకు అడిగి మరి టేక్స్ చేస్తుంటా. ఈ సిరీస్‌ను మేము 30 రోజుల్లోనే పూర్తి చేశాం. నేను ‘పులి మేక’ సిరీస్ చేశాక తమిళంలో ఒక డార్క్ థ్రిల్లర్ చేశాను. మధ్యలో తెలుగులో ఒక యాక్షన్ సినిమా చేశా. ఇలా యాక్షన్, థ్రిల్లర్స్ తర్వాత ఇలాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఎంతో ఉల్లాసాన్నిచ్చింది’’.