Lavanya and Raj Tarun Case: మాల్వీపై మోజుతో.. నన్ను వదిలించుకోవడానికే ఇవన్నీ!
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:27 PM
‘‘పదకొండేళ్లగా రాజ్‌తరుణ్ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. రాజ్ నాకు కావాలి’’ అని చెబుతోంది లావణ్య.
"పదకొండేళ్లగా రాజ్‌తరుణ్ నాతో ఉంటున్నాడు. ఏడేళ్లు ఇద్దరం కలిసి సంసారం చేశాం. అతనంటే నాకు ప్రాణం. రాజ్ నాకు కావాలి’’ అని చెబుతోంది లావణ్య. రాజ్‌తరుణ్ తనను ప్రేమించాడనీ పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఇటీవల ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజ్‌తరణ్ కూడా స్పందించాడు. రిలేషన్ లో ఉన్న మాట నిజమేనని, కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరంగా ఉన్నాననీ, కొంతకాలంగా టార్చర్ చేస్తుందని మీడియాకు తెలిపారు రాజ్ తరుణ్. తాజాగా ఇదే విషయంపై లావణ్య కూడా స్పందించారు.
"గత మూడు నెలలుగా రాజ్‌తరుణ్ నాకు దూరంగా ఉంటున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్‌కు అక్రమ సంబంధం ఉంది. ఆమె రాజ్ లైఫ్‌లోకి వచ్చిన తర్వాతే మా మధ్య గ్యాప్ వచ్చింది. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలని ఉద్దేశంతోనే రాజ్ నాపై ఆరోపణలు చేస్తున్నాడు. డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ కేసులో ఉన్న మస్తాన్ నా స్నేహితుడు కావడంతో ఆ కేసులో నన్నూ ఇరికించారు. మా జీవితాల నుంచి మాల్వీ త్వరగా పోవాలి. ఈ వ్యవహారంలో నేను న్యాయపోరాటం చేస్తాను. మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు నన్ను బెదిరిస్తున్నారు. మస్తాన్ తో నాకు అక్రమ సంబంధం అంటగట్టారు. మస్తాన్ సాయి నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరి మఽధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు.
మే నెలలో మల్హోత్రాతో చెన్నైలో ఓ హోటల్లో గడిపిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మేము గతంలో ఓ గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నాము. మాల్వీ తన లైఫ్‌లోకి వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. రాజ్ తరుణ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదు. నేను డ్రగ్స్ తీసుకొని ఫ్లాట్‌కు వచ్చే దాన్ని అని మాటలు అవాస్తవం. నా జీవితం మొత్తం రాజ్ తరుణ్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పటికీ నేను అతనితోనే కలిసి జీవించాలనుకుంటున్నా. ఈ వ్యవహారం గురించి సినీ పెద్దలకు ఫిర్యాదు చేస్తాను. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. నేను నార్సింగ్ పోలీసులకు ఆధారాలన్నీ అందజేయడానికి సిద్థంగా ఉన్నాను. నేను ఆరోపణ చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలున్నాయి. నాకు ప్రాణి హాని ఉంది. దయచేసి నాకు భద్రత కావాలని పోలీసులను కోరుతున్నాను’’ అని లావణ్య పేర్కొన్నారు.