Jani Master Arrest: గోవాలో అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలింపు..
ABN, Publish Date - Sep 19 , 2024 | 01:05 PM
టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు టీమ్ గోవాలో ఆయన్ని అదుపులోకి తీసుకుంది.
టాలీవుడ్ డాన్స్ మాస్టర్ జానీ (Jani Master) అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు టీమ్ (Sot Police team) గోవాలో ఆయన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి జానీని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచే అవకాశముందని తెలుస్తోంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగికి కేసును బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు.
బాధిత కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో ఏముందంటే..
‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో అసిస్టెంట్‌గా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తోపాటు నేను, మరో ఇద్దరు అసిస్టెంట్స్ వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే టీమ్ నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేదని బెదిరించసాగాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ కారావ్యాన్‌లో ఇబ్బందికరంగా ప్రవర్తించేవాడు. తన లైంగిక వాంఛలు తీర్చిమని కోరాడు. అలా చేయనుందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి వేసి కొట్టాడు. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేశాడు. ఆ వేధింపులు భరించలేక అతని టీమ్ నుంచి బయటకొచ్చేశాను. నన్ను సొంతంగా పని చేసుకో నివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడు. ఆగస్టు 28న మా ఇంటి గుమ్మానికి గుర్తుతెలియని వ్యక్తులు ఓ పార్సిల్ వేలాడదీశారు. ‘మగబిడ్డకు అభినందనలు. కానీ జాగ్రత్తగా ఉండు’ అని అందులో రాసి ఉంది’’ అని సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు ఆరేళ్లగా జానీ మాస్టర్ బృందంలో పని చేసిన బాధితురాలు అతని టీమ్ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా కొరియోగ్రఫీ మొదలుపెట్టింది. శర్వానంద్ నటించిన మనమే చిత్రానికి ఆమె కొరియోగ్రఫీ చేసింది. ఈ ఏడాది ప్రకటించిన 70వ జాతీయ పురస్కారాల్లో జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వరించింది. ధనుష్, నిత్యామీనన్ నటించిన తమిళ చిత్రం ుతిరుచిత్రంబలం’ చిత్రానికిగానూ ఆయనకు జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు.