Janhvi Kapoor: ఈసారి కుదరలేదు.. త్వరలో మళ్లీ కలుస్తా

ABN, Publish Date - Sep 23 , 2024 | 10:30 AM

తెలుగు ప్రేక్షకులు తనను జాను పాప అని పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ  జాన్వీకపూర్‌. ఆ మేరకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు ప్రేక్షకులు తనను జాను పాప అని పిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు అతిలోక సుందరి శ్రీదేవి తనయ  జాన్వీకపూర్‌. ఆ మేరకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. దేవర ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలుగులోనే మాట్లాడాలని ప్లాన్‌ చేసుకున్న ఆమె ఈవెంట్‌ రద్దు కావడం గురించి స్పందించారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో అభిమానులతో చెప్పాలనుకున్న మాటలను ఓ వీడియో ద్వారా తెలిపారు. అందులో జాన్వీ కపూర్‌ అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

‘అందరికీ నమస్కారం. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ధ్యాంక్స్‌. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు  ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను మీరు సొంత మనిషిలా భావించడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా అమ్మకు, నాకు కూడా మీరందరూ అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్‌ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. ‘దేవర’ నా మొదటి అడుగు. శివగారు, ఎన్టీఆర్‌ నన్ను ఈ సినిమాకు ఎంపిక చేయడం నా అదృష్టం. మా ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్‌ చేసినందుకు దేవర టీమ్‌ అందరికీ నా ధన్యవాదాలు’ అని తెలిపారు.

తాను ఈ మాటలను స్వయంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పాలనుకున్నారు.  "కానీ ఈసారికి అలా కుదరలేదన్నారు. త్వరలోనే అందరినీ కలుస్తాను" అని   చెప్పారు.  ఈ వీడియో బైట్‌లో జాన్వీ లంగా ఓణీ కట్టుకొని అచ్చ తెలుగులో మాట్లాడడం చూసి అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రమిది. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని మేకర్స్‌ భావించి ఏర్పాట్లు చేశారు. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జనరల్‌ పాసులు పొందినవారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యా?రీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగీంది. దీంతో ఆ వేడుకను రద్దు చేశారు. ఈవెంట్‌ రద్దు కావడం పట్ల తనకు ఎంతో బాధ కలిగిందని ఎన్టీఆర్‌ ఓ వీడియో ద్వారా తెలిపారు.  

Updated Date - Sep 23 , 2024 | 10:30 AM