RGV Case: రాంగోపాల్‌ వర్మకు హైకోర్టులో చుక్కెదురు..

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:06 PM

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. అతనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.


టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు (Ram gopal varma) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. అతనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు (maddipadu police) నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరుగుతోన్న తరుణంలో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయ స్థానం తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని న్యాయస్థానం తెలిపింది. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్ధించారు. సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇటువంటి అభ్యర్థనలు కోర్టు ముందు కన్నా పోలీసులతో చేయాలని న్యాయమూర్తి స్పష్టీకరించారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను తీసిన ువ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారని తెదేపా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే! 

Updated Date - Nov 18 , 2024 | 12:20 PM