ఆల్ టైమ్ టాప్ ఫైవ్ లో హనుమాన్, ఇది నిజంగా అద్భుతం
ABN, Publish Date - Jan 20 , 2024 | 01:31 PM
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హనుమాన్' సినిమా మరిన్ని సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా అల్ టైమ్ టాప్ ఫైవ్ లో చేరిపోయింది. మిగతా నాలుగు సినిమాలు అగ్రనటులు, అగ్ర దర్శకులు చేసిన సినిమాలతో ఈ చిన్న సినిమా చేరడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి.
తెలుగు సినిమాకి విదేశీ మార్కెట్ ఇప్పుడు చాలా కీలకం అయింది. ముఖ్యంగా అమెరికాలో వున్న తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాలని విపరీతంగా ప్రోత్సహిస్తారు. అందులోకి ఆ సినిమా బాగుంటే, ఇక ఆ సినిమాకి కాసుల వర్షమే కురుస్తుంది అక్కడ. సంక్రాంతి పండగకి తెలుగు సినిమాలు నాలుగు విడుదలయితే, అందులో చిన్న సినిమా అయిన 'హనుమాన్' సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో తేజ సజ్జ కథానాయకుడు, నిరంజన్ రెడ్డి నిర్మాత.
ఈ సినిమా ఇప్పుడు ఇంకో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాలలో ఈ చిన్న సినిమా అయిన 'హనుమాన్' ఎక్కువ కలెక్షన్స్ చేసిన మొదటి ఐదు సినిమాల్లో ఒకటిగా చేరింది. ఇది మొత్తం చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నిట్లో ఐదో సినిమాగా నిలిచింది అంటే, ఈ 'హనుమాన్' ఒక చరిత్ర సృష్టిస్తోంది అనే చెప్పాలి. మొదటి నాలుగు సినిమాలు పెద్ద నటులు, పెద్ద దర్శకులు, పెద్ద బడ్జెట్ సినిమాలు కావటం, వారితో పోలిస్తే 'హనుమాన్' లాంటి చిన్న సినిమా వాటి పక్కన ఉండటం నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి.
విదేశీ మార్కెట్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్స్ పొందిన మొదటి నాలుగు సినిమాలు వరసగా బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, సలార్, బాహుబలి 1 కావటం విశేషం. ఇప్పుడు ఐదో సినిమాగా 'హనుమాన్' చేరటం ఒక చరిత్ర, అద్భుతం. ఈ సినిమా ఇంకా నడుస్తోంది, ఇంకా ఎక్కువ కలెక్టు చేసే అవకాశం కూడా వుంది. 'బాహుబలి 2' సినిమా 20.5 మిలియన్ల అమెరికా డాలర్లు కలెక్షన్స్ సంపాదించగా, 'ఆర్ఆర్ఆర్' $14.3 మిలియన్స్, 'సలార్' $8.8 మిలియన్స్, 'బాహుబలి 1' $8 మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు 'హనుమాన్' $3.7 మిలియన్స్ రాబట్టింది, ఈ సినిమా ఇంకా నడుస్తోంది. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి అమెరికాలో ఈ సినిమా స్వంతంగా విడుదల చేసుకున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి:
HanuMan movie review: ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ఎలా ఉందంటే...