Mahesh Babu: 'గుంటూరు కారం' టికెట్ ధర పెంచడానికి, బెనిఫిట్ షోస్ కి అనుమతి
ABN, Publish Date - Jan 09 , 2024 | 03:22 PM
మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' టికెట్ రేట్స్ పెంపునకు, బెనిఫిట్ షోస్, ఒక వారం రోజుల వరకు ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో ఉదయం నాలుగు గంటలకి అదనపు ఆటకు అనుమతిని మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' వార్తల్లో వుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న హైదరాబాదులోని యూసుఫ్ గూడ, పోలీసు గ్రౌండ్స్ లో జరగాల్సి ఉండగా, ఆ వేడుకకి పోలీసు అధికారుల అనుమతి లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు ఆ వేడుక ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు దగ్గర ఈరోజు (జనవరి 9) చేస్తున్నారు. అలాగే ఆ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇస్తుందా, ఇవ్వదా అనే సందేహం కూడా మహేష్ బాబు అభిమానుల్లో చోటుచేసుకుంది. (Guntur Kaaram gets extra shows, benefit shows and also can hike ticket rates)
అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక జీఓ ని విడుదల చేసింది. అందులో 'గుంటూరు కారం' సినిమాకి మొదటి వారం టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చినట్టుగా పేర్కొంది. మల్టీ ప్లెక్స్ లో రూ. 100 రూపాయలు, సింగిల్ థియేటర్స్ లో రూ. 65 రూపాయలు పెంచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా ఆ జీవోలో వుంది. అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్ లో ఒక ఉదయం 4 గంటల నుండి ఆటలు వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవోలో చెప్పింది. ఈ అదనపు ఆట మొదటి వారానికి మాత్రమే వర్తిస్తుందని చెప్పింది.
అలాగే ఈనెల అంటే 11వ తేదీ అర్థరాత్రి (తెల్లవారితే 12వ తేదీ) కొన్ని థియేటర్స్ లో అర్థరాత్రి ఒంటి గంటకి ఈ సినిమా బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. మొత్తం 23 థియేటర్స్ లలో (మల్టీ ప్లెక్స్, సింగిల్ థియేటర్స్ కలిపి) ఈ ఒంటి గంట బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి కొన్ని రోజులుగా ఈ 'గుంటూరు కారం' అదనపు ఆటలు గురించి ఆందోళన చెందుతున్న మహేష్ బాబు అభిమానులకి ఇది ఒక ఊరటగా లభించింది. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన 'సలార్' సినిమాకి కూడా ఇలా అదనపు ఆటల కోసం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.