Ghatikachalam: వాస్తవ ‘హర్రర్’ ఘటనలతో.. ‘ఘటికాచలం’
ABN, Publish Date - Oct 14 , 2024 | 04:09 PM
హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుందని ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ అన్నారు. తాజాగా ఆయన డైరెక్టర్ మారుతితో కలిసి రిలీజ్ చేస్తున్న కొత్త చిత్రం ‘ఘటికాచలం’ మూవీ టీజర్ లాంఛ్ సోమవారం జరిగింది.
నిఖిల్ దేవాదుల (Nikhil devadula) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘటికాచలం’(Ghatikachalam). ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై ఎం.సి రాజు నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అయితే స్టార్ ప్రొడ్యూసర్ Skn, డైరెక్టర్ మారుతి (Maruthi) ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా తాజాగా సోమవారం సినిమా టీజర్ విడుదల చేసి ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. మంచి టీమ్ దొరికింది. డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్కేఎన్‌లకు ఈ సినిమా ట్రైలర్ చూపించగా నచ్చి మూవీ కూడా చూసి చిన్న చిన్న మార్పుులు చెప్పారు. తర్వాత వారే మూవీని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి అన్నారు.
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. అమర్ గారు ఎంత ఇంటెన్స్ గా స్టోరీ నెరేట్ చేశారో దాన్ని నా పర్ ఫార్మెన్స్ లో చూపించానని అనుకుంటున్నాను. ఘటికాచలం సినిమా ఒక టీనేజ్ అబ్బాయి, వాళ్ల అబ్బాయి మధ్య జరుగుతుంది. కథలో ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఎస్కేఎన్, మారుతి గారికి చాలా థ్యాంక్స్ క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే పెద్ద పనయ్యింది. అలాంటి టైమ్‌లో వారు ముందుకొచ్చారు. నేను 15 ఏళ్లుగా నటిస్తున్నాను. 60 నుంచి 70 సినిమాలు చేశాను. ఘటికాచలం సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘటికాచలం సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. నేను ఎదురుచూస్తున్న ఒక మంచి క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో దొరికింది. ఫాదర్ సన్ మధ్య ఎమోషన్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. ఇది నిజంగా జరిగిన సంఘటనల నేపథ్యంతో తెరకెక్కించారు. ఫుల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఎస్కేఎన్, మారుతి గారు మూవీ తీసుకున్నారంటేనే ఈ మూవీలో ఎంతమంచి కంటెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిఖిల్ ఈ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్తాడన్నారు. హీరోయిన్ ఆర్వికా గుప్తా మాట్లాడుతూ.. మా టీమ్ కు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. నాకు తెలుగు ఎక్కువగా రాదు. ఘటికాచలం సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ఘటికాచలం సినిమా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయలేరు. మీ ఊహకతీతంగా సినిమా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు ఘటికాచలం సినిమా సీన్స్ గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి మూవీని మా మారుతి, ఎస్కేఎన్ రిలీజ్ చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ..- డైరెక్టర్ అమర్ నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. ఘటికాచలం సినిమా ట్రైలర్‌ను దర్శకుడు మారుతి చూసి అమర్ గారికి సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఈమూవీ చూశాక సినిమా రిలీజ్ చేసేందుకు ఎస్కేఎన్, మారుతి గారు ముందుకు వచ్చారు. ఈ సినిమా హిట్ అయ్యి అమర్, నిఖిల్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి రాలేక పోయారు. చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అలాంటి చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ ఇలా మేమంతా అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అనేదాని కంటే టెక్నికల్ గా ఉన్న క్వాలిటీ బాగా ఆకట్టుకుంది.
డైరెక్టర్ అమర్ ఓపది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న డైరెక్టర్ లా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది. నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇకపై హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్‌లో నటించమని అతనికి నేను సలహా ఇచ్చా. ఘటికాచలం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మా బేబీ సినిమా హందీ వెర్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయన్నారు.