Gabbar Singh Re Release: గబ్బర్‌సింగ్‌ నన్ను ఎంచుకుంది.. సమయం వచ్చినప్పుడు అది కూడా..

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:20 PM

‘‘నా తల్లిదండ్రులు జన్మనిస్తే పవన్‌కల్యాణ్‌ నాకు బతుకునిచ్చారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్లినా పవన్‌ లేకపోతే ఈ పేరు, క్రేజ్‌ ఉండేది కాదు’’ అని బండ్ల గణేష్‌ అన్నారు.


‘‘నా తల్లిదండ్రులు జన్మనిస్తే పవన్‌కల్యాణ్‌ నాకు బతుకునిచ్చారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్లినా పవన్‌ (Pawan Kalyan) లేకపోతే ఈ పేరు, క్రేజ్‌ ఉండేది కాదు’’ అని బండ్ల గణేష్‌ (bandla Ganesh) అన్నారు.
పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆయన నిర్మించిన గబ్బర్‌సింగ్‌ (Gabbar singh) చిత్రం 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. సెప్టెంబన్‌ 2న పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్థమైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.

బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ‘‘ఒకరోజు పవన్‌ నన్ను పిలిచి.. ‘నేను సినిమా చేస్తా. నువ్వు నిర్మాతగా ఉంటావా అని అడిగారు’.  ఆయనతో ‘తీన్‌మార్‌’ చేశా.  నన్ను నిర్మాతగా చేసిన ఆయనకు పాదాభివందనం. ‘గబ్బర్‌సింగ్‌’ ఒక చరిత్ర. పవన్‌కల్యాణ్‌ అభిమానులకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.  పవన్‌ గొప్ప మానవత్వం, నిజాయతీ, నిబద్థత కలిగిన వ్యక్తి. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుని, సంతోషంగా జీవితాన్ని కొనసాగించే నటుడు పవన్‌కల్యాణ్‌. జనం కోసం తన కుటుంబాన్ని వదిలేసి పోరాడుతున్నారు. దాదాపు 10 ఏళ్లు ప్రజల కోసం పోరాడి ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. పవన్‌తో గబ్బర్‌సింగ్‌ చేయడం నా అదృష్టం. రీ రిలీజ్‌కు  ఏడాది నుంచే ప్లాన్‌ చేస్తున్నా. గుజరాత్‌లో షూట్‌ చేస్తున్నప్పుడు పవన్‌ గుర్రంపై నుంచి కిందపడ్డారు. ఆరోజు నాకు గుండె ఆగిపోయింది. షూట్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దర్శకుడు ఏం చెబితే అది చేసే వ్యక్తి ఆయన. నమ్మితే అలాగే చేస్తారు. తెలుగు సినీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న రోజులివి. దాదాపు ఏడేళ్ల నుంచి సినిమాలు నిర్మించకుండా ఉన్నందుకు బాధపడుతున్నా. ఇకపై బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేస్తా. రానున్న రోజుల్లో పరమేశ్వర ఆర్ట్స్‌ బండ్లగణేశ్‌ అంటే ఏంటో చూపించేందుకు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు నిర్మిస్తా’’ అని బండ్ల గణేశ్‌ అన్నారు.

కొంత గ్యాప్‌ తర్వాత మీడియా ముందుకు రావడం ఎలా ఉంది?
బండ్ల గణేశ్‌: అడవిలో తప్పిపోయిన పిల్లాడు ఏడేళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రులను కలిసినట్టు ఉంది.

కొత్త సినిమాతో మీడియా ముందుకు వస్తారనుకున్నాం.  

బండ్ల గణేశ్‌: ఇది ప్రతిరోజూ కొత్త చిత్రమే. గబ్బర్‌సింగ్‌ అనేది చరిత్ర. రీ రిలీజ్‌కు కూడా భారీ స్పందన వస్తుందని ఊహించలేదు. ఇదీ పవన్‌ స్ట్టామినా. ఆయన గొప్ప వ్యక్తి. కొత్త సినిమాల కంటే ఈ చిత్రానికి బ్రహ్మాండమైన వసూళ్లు వస్తాయి. సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. ఇందులో రిజర్వేషన్లు, వారసత్వం ఉండదు. టాలెంట్‌ మాత్రమే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కళామ్మతల్లి బిడ్డగా బతకడానికి మించి ఈ జన్మకు ఏమీ అవసరం లేదు.

హరీశ్‌ శంకర్‌తో మీ తదుపరి చిత్రం ఉంటుందా?

బండ్ల గణేశ్‌: 200 శాతం. గబ్బర్‌సింగ్‌ స్థాయి చిత్రం చేయకపోతే నా పేరు బండ్ల గణేశ్‌ కాదు.

ఇంద్ర రీ రిలీజ్‌ వసూళ్లు రికార్డు క్రియేట్‌ చేశాయి. గబ్బర్‌సింగ్‌ కూడా రికార్డు క్రియేట్‌ చేస్తుంది. దానిపై మీ అభిప్రాయం?
బండ్ల గణేశ్‌: నేను హైదరాబాద్‌ వచ్చిందే చిరంజీవిని చూడటానికి. నాకు స్వార్థం ఎక్కువ. ఎందుకంటే నా సినిమా పైన ఉండాలనుకుంటా. ఇంద్రను మించిన స్థ్థాయిలో నా సినిమా ఉండాలని కోరుకుంటా. చిరంజీవిపై నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నా హృదయంలో ఆయనకు ఎప్పుడూ ప్రథమ స్థానం ఉంటుంది. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి. హరీశ్‌ దర్శకత్వంలో నేను నిర్మాతగా ఆయన డైరీలో 70 రోజులు ఇవ్వమని మీడియా ద్వారా చిరంజీవి గారిని అడుగుతున్నా. చరిత్రలో నిలిచిపోయే సినిమా చేస్తా.

మీ తదుపరి చిత్రం ‘ఉస్త్తాద్‌ భగత్‌సింగ్‌’ అప్‌డేట్‌ ఏదైనా ఇవ్వగలరా?

హరీశ్‌ శంకర్‌: మొన్ననే పవన్‌కల్యాణ్‌ను కలిశాం. త్వరలోనే సినిమా షూటింగ్స్‌ తిరిగి ప్రారంభించనున్నారు. ఓజీ, ఉస్తాద్‌ రెండూ మొదలవుతాయి. అయితే ఆయన డేట్‌ ఇవ్వడాన్ని బట్టి అప్‌డేట్‌ ఇవ్వగలను.  

చిరంజీవితో సినిమా చేసే ఆలోచన ఉందా?

హరీశ్‌ శంకర్‌:
మేమిద్దరం ఎప్పుడు కలిసినా.. ఆ కాంబో గురించే మాట్లాడుకుంటాం. ఇటీవల ఆయనతో చేసిన యాడ్‌  చాలా ఎంటర్‌టైనింగ్‌గా వచ్చింది. ఆయనకు బాగా నచ్చింది. నన్నెంతో మెచ్చుకున్నారు. నేను ప్రకృతి, విధిని బాగా నమ్ముతా.. గబ్బర్‌సింగ్‌ను నేను ఎంచుకోలేదు. అదే నన్ను ఎంచుకుంది. సమయం వచ్చినప్పుడు ఇది కూడా జరుగుతుందని విశ్వసిస్తున్నా.  

హరీశ్‌ శంకర్‌: ఓ సందర్భంలో చిరు సర్‌ నాతో సరదాగా మాట్లాడుతూ.. నువ్వు కల్యాణ్‌ ఫ్యానా లేదా నాకు ఫ్యానా అని అడిగారు. లక్ష్మణుడికి నమస్కారం చేసిన వాడు రాముడికి భక్తుడు కాకుండా పోతాడా అని చెప్పా.

మీరు క్రేజీ కాంబినేషన్స్‌లో సినిమాలు చేశారు. ఇకపై అలాంటి క్రేజీ కాంబోలు ఆశించవచ్చా?

బండ్ల గణేశ్‌: కాంబినేషన్స్‌ కాదు. మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నా. చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా విజయాన్ని అందుకునే చిత్రాలు చేయాలనుకుంటున్నారు. చాలామంది నన్ను చిన్న సినిమాలు ఎందుకు తీయవని అడుగుతుండేవారు. ఏదైనా ఒకటే కష్టం.. పెద్ద సినిమాలే చేస్తాను అన్నాను. చిన్న సినిమాలను విస్మరించడం తప్పని ఇప్పుడు తెలిసింది.

పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా?

బండ్ల గణేశ్‌: అవును. నా రక్తంలో కాంగ్రెస్‌ ఉంది. రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌లో ఉంటా. లేకపోతే రాజకీయాలు వదిలేసి సినిమాలు తీసుకుంటా. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండాలని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటా.

పవన్‌.. తాను సినిమాలకు కాస్త దూరంగా ఉంటానని ఇటీవల చెప్పారు దానిపై మీ కామెంట్‌?


బండ్ల గణేశ్‌: మేము అంగీకరించం. ఆయన సినిమాలు చేయాల్సిందే. ఆయనకు ఆదాయం వచ్చేది సినిమాతోనే.  ఏ పదవిలో ఉన్నా సమయం చూసుకుని మాలాంటి అభిమానుల కోసం సినిమాలు చేయాలి.



 

Updated Date - Aug 31 , 2024 | 03:30 PM