Harihara Veeramallu: 'హరిహర వీరమల్లు’.. రెడీ అవుతున్నాడు! ఫ్యాన్స్‌కు ఇక పండ‌గే

ABN, Publish Date - Sep 20 , 2024 | 02:12 PM

పవన్‌ తదుపరి చిత్రాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఈ న్యూస్‌ మంచి శుభ‌వార్త‌. సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు మేకర్స్ స్ప‌ష్టం చేశారు.

Harihara Veeramallu

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తదుపరి చిత్రాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఈ న్యూస్‌ మంచి శుభ‌వార్త‌. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu), ఓజీ’, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాలు చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో ఎన్నిక‌లు, డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇలా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో బిజీ అవ‌డంతో త‌ను న‌టించాల్సిన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. ఈ చిత్రాలకు పవన్‌కల్యాణ్‌ 20 రోజుల చొప్పున షూటింగ్‌ చేస్తే చిత్రీకరణ పూర్తయిపోతుందని ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్‌ ప్రకటించారు. దీంతో తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్‌ 'హరిహర వీరమల్లు' చిత్రానికి డేట్స్‌ ఇచ్చారని, సెప్టెంబర్ 23 నుంచి 'హరి హర వీర మల్లు' చిత్రీకరణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు స్ప‌ష్టం చేశారు.

అయితే ఆగస్ట్‌లోనే పవన్‌ ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. రాజకీయ పనుల్లో బిజీ కావడం, మరో పక్క వరదల కారణంతో ఆయన షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపారు. ఇదిలాఉండ‌గా హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) కోసం పవన్‌ కల్యాణ్‌ 20 రోజులు షూటింగ్ చేస్తే చాలు సినిమా మొత్తం పూర్తయినట్లే. తదుపరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహించి సినిమాను విడుదల చేసే సన్నాహాల్లో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. పవన్‌ చేయాల్సింది అంతా ఇండోర్‌ షూట్‌ మాత్రమే. అందు కోసం సెట్‌ వర్క్ కూడా విజయవాడలో జరుగుతోంది. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు.

ఈ నేప‌థ్యంలో హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో 400 మంది సిబ్బంది, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. 'బ్రేవ్ హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి పలు క్లాసిక్ చిత్రాలకు పని చేసిన చ‌రిత్ర నిక్ పావెల్‌కు ఉంది. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు.


పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. తొలుత ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడిగా 60 శాతానికి పైగా సినిమాను పూర్తి చేయ‌గా ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్మాత ర‌త్నం కుమారుడు , డైరెక్ట‌ర్ జ్యోతి కృష్ణ మిగ‌తా షూటింగ్‌ను పూర్తి చేయ‌నున్నాడు. అనుపమ్‌ ఖేర్‌, బాబీ దేవోల్‌, విక్రమ్‌సింగ్‌ విర్క్‌, నోర ఫతేహి, నర్గీస్‌ ఫక్రీ, సచిన్‌ ఖేడ్కర్‌, జిషుసేన్‌ గుప్తా. దాలిప్‌ తాహిల్‌ కీలక పాత్రధారులు. ఎ.దయాకరరావు, ఏ.ఎం రత్నం సంయుక్తంగా మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో ఏప్రిల్‌లో సినిమా విడుదల ఉండొచ్చని టాక్‌ నడుస్తోంది.

ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా.. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి క‌ళా ద‌ర్శ‌కుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' (OG) విషయానికొస్తే.. ఈ చిత్రానికి 20 నుంచి 25 రోజులు అవుట్ డోర్‌ షూటింగ్‌ చేయాల్సి ఉంది. 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ పూర్తి కాగానే ఓజీ సెట్‌లో పాల్గొంటానని పవన్‌ ఇప్పటికే మాటిచ్చారని మేకర్స్‌ చెప్పారు. ఆ తర్వాతే ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - Sep 20 , 2024 | 02:12 PM