Exhibitors: సింగిల్‌ స్క్రీన్స్ కు  ప్రాణం పోశారు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:20 PM

రానున్న రోజుల్లో బెనిఫిట్‌ (Benifit shows)షోలు, టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం ఎగ్జిబిటర్స్‌ సమావేశం జరిగింది.



రానున్న రోజుల్లో బెనిఫిట్‌ (Benifit shows)షోలు, టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సోమవారం ఎగ్జిబిటర్స్‌ సమావేశం జరిగింది. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy) నిర్ణయాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎగ్జీబిటర్లు కూడా స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ ‘‘కొత్త సినిమా విడుదలైన రెండు, మూడు రోజులు అభిమానులు, కాలేజ్‌ స్టూడెంట్స్‌ యువత, మాస్‌ ఎక్కువగా చూస్తారు. టికెట్‌ ధరలు పెంచి, వారి నుంచి అత్యధిక వసూళ్లు చేయడం బాధాకరంగా ఉంది. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్‌ ధరలు ఉండేలా చూడాలని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌రాజును (Dilraju) కోరాం. ఈ క్రమంలో సీఎం రేవంత్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రీమియర్‌ షోల పేరిట రూ.1200 టికెట్‌ ధర పెడితే, అదే ధర ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ విషయంలో అనేక రకాలుగా ధరలు నిర్ణయించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది ఆంధ్రా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు స్వాగతించారు. ఇది సింగిల్‌ స్క్రీన్  థియేటర్‌లకు మరో నాలుగేళ్ల పాటు ప్రాణం పోసినట్లు అయింది. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ, తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలన్న నిర్ణయం నిర్ణయం కరెక్ట్‌ కాదు. బెనిఫిట్‌ షోల, రేట్లు పెంచవద్దని మేం డిమాండ్‌ చేస్తున్నాం. సినిమా నిర్మాణ ఖర్చు ఎక్కువ అయిందని రేట్లు పెంచుతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. కానీ, థియేటర్‌లో ఆక్యుపెన్సీ తగ్గుతోంది. ఏపీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చాం. బెనిఫిట్‌ షోలకు అధిక రేట్లు వద్దని కోరాం. తెలంగాణ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తాం. పెంచిన టికెట్‌ రేట్ల బారం మొత్తం ప్రేక్షకుడి మీదే పడుతోంది. ఏడాదిలో 80 శాతం మిడిల్‌ బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయి. పెద్ద బడ్జెట్‌ సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకుడు ఆ నెలలో ఆ సినిమా చూసి మరో దానికి వెళ్లడం లేదు. దీంతో చిన్న, మిడ్‌ రేంజ్‌ సినిమాలు దెబ్బ తింటున్నాయి’’ అని విజేందర్‌ రెడ్డి అన్నారు.

‘‘నిర్మాతలను మేం కోరేది ఒక్కటే.. ప్రేక్షకులు రెండు రకాలు. డబుబ్న్నవారు మల్టీప్లెక్స్‌లో చూస్తారు. అక్కడి సౌకర్యాలకు అనుగుణంగా ధరలు పెంచుకోండి.. మధ్యతరగతి వాళ్లు సింగిల్‌  స్క్రీన్ లకు  వస్తారు. ఇక్కడ టికెట్‌ ధర రూ.500 పెడితే ఎవరూ రావటం లేదు. పెంచిన టికెట్‌ ధరకు సరిపడా సౌకర్యాలు మా దగ్గరలేవు. మా దగ్గర లేవు. దీంతో ప్రేక్షకులు తిట్టుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల వాళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.

 

Updated Date - Dec 23 , 2024 | 03:21 PM