Jani Master: జానీ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఛాంబర్ ఏం చెప్పిందంటే!
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:02 PM
కొరియెగ్రాఫర్ జానీ (Jani master) మాస్టర్‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన సంగతి తెలిసిందే! బాధిత డాన్సర్ (Female Dancer) రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కొరియెగ్రాఫర్ జానీ (Jani master) మాస్టర్‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన సంగతి తెలిసిందే! బాధిత డాన్సర్ (Female Dancer) రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, జాన్సీ తదితరులు ఈ కార్యకమంలో పాల్గొన్నారు.
జాన్సీ (Jhansi) మాట్లాడుతూ ‘‘బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. అప్పటి దాకా కాస్త సంయమనం పాటించాలి. ప్రభుత్వం తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీలో మహిళల రక్షణ నిమిత్తం సరైన గైడ్‌లైన్స్ లేవు. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఒక కమిటీ ఫామ్ అయింది. అప్పటి నుంచి భద్రత విషయంలో కట్టుదిట్టంగా ఉన్నాం. జానీ మాస్టర్ వివాదం రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనతో ఉంది. మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరాము. పోలీసుల విచారణ, మా విచారణ పార్లర్‌గా జరుగుతుంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను, జానీ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాం. 90 రోజుల లోపే దీనిపై క్లారిటీ వస్తుంది. దయచేసి బాధితురాలి ఫేస్‌ను రివీల్ చేయవద్దని మీడియాను కోరుతున్నాం అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని ఝాన్సీ స్పష్టం చేశారు.
‘‘సంగీత, ప్రేమ, ప్రగతి ‘వాయిస్ ఆఫ్ విమెన్’లో భాగం. ఇటీవల సమంత దీని గురించే పోస్ట్ పెట్టారు. ‘వాయిస్ ఆఫ్ విమెన్’ ఇండస్ట్రీకి సంబంధించిందే తప్ప వేరు కాదు. ఛాంబర్.. ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. ఎప్పుడైతే పెద్దవాళ్లు మాట్లాడతారో అప్పుడే దాని గురించి చర్చ జరుగుతుంటుంది. మా వద్దకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఒకటి, రెండు స్థానాల్లోనే ఉన్నాయి. కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపాం. రెండు ఫేక్ కంప్లైట్స్ కూడా వచ్చాయి. పలువురు మహిళలు మిస్ యూజ్ కూడా చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికీ ప్రత్యేక సెక్షన్ ఉంది. కమిటీలకు సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి. జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన అమ్మాయి విషయాకొస్తే.. పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదుర్కోవడమే కాదు వేరే ఎన్నో విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. లీగల్‌గా, మెడికల్‌గా, పోలీసుల సాయం తీసుకోవడానికి ఒకవేళ ఆ అమ్మాయికి తగిన ధైర్యం లేకపోతే కమిటీ హెల్ప్ చేయగలగాలి. ఆ క్రమంలోనే భూమిక హెల్ప్‌లైన్ అనే ఎన్జీవో సపోర్ట్‌గా నిలిచింది’’ ఝాన్సీ పేర్కొన్నారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఆదేశించాము’’ అని అన్నారు.
"మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం మా దగ్గరకు వచ్చింది. మహిళల భద్రత కోసం 2013 లో ఆసరా అనే కమిటీ పెట్టాం.. 2018లో సరికొత్తగా ప్యానల్ ఏర్పాటు చేశా. ఇలాంటివి ఎన్ని ఉన్నా మహిళలకు ధైర్యం, భరోసా ఇవ్వలేకపోతున్నాం. తమకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఉందనే ధైర్యం కావాలి.. అందుకు తగ్గ కమిటీ ఉండాలి. 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు పరిష్కారం అవుతుంది. ఇలాంటి విషయాలను పరిష్కరించడానికి ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైంట్ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
ఫిర్యాదు చేయండి: టీఎఫ్‌సీసీ
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు ఫిర్యాదు చేయాలని టీఎఫ్‌సీసీ ఓ ప్రకటనలో కోరింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ వద్ద ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంప్లైట్ బాక్స్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,
డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్,
ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ హైదరాబాద్- 500 096
చిరునామాకు పోస్ట్ ద్వారా అయినా ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది.
ఫోన్ నంబరు: 98499 72280, మెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in ద్వారా కంప్లైట్స్ ఇవ్వొచ్చని విజ్ఞప్తి చేసింది.