Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..
ABN, Publish Date - Dec 31 , 2024 | 05:43 PM
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నూతనంగా ఎన్నికైన ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు ఖండించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనొక లేఖను విడుదల చేశారు. అందులో..
ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున కొందరు సినీ ప్రముఖులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో ఏమేం చర్చించారో నూతన FDC ఛైర్మన్ దిల్ రాజు మీడియాకు వివరించారు. అయినా కూడా ఆ మీటింగ్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మీటింగ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నూతన FDC ఛైర్మన్‌గా ఎన్నికైన దిల్ రాజు ఖండిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఏముందంటే..
‘‘గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్‌గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎంగారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎంగారు కాంక్షించారు.
Also Read- Nassar: మా జీవితాల్లో అతనిది ప్రత్యేక పాత్ర
హైదరాబాదును గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎంగారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరినీ కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే.. ‘‘సినీ ప్రముఖుల భేటీ తర్వాత అంతా సైలెన్స్ అయ్యారు. అదంతా డైవర్షన్ అండ్ అటెన్షన్ మీటింగే. రహస్య ఒప్పందాలు ఏవో జరిగి ఉంటాయి. సంధ్య థియేటర్ ఘటనపై సెటిల్‌మెంట్ అయిపోయి ఉండవచ్చు. సినిమా పేరుతో వెళ్లి సర్దుబాబు చేసుకుని ఉండొచ్చు..’’ అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.