Raju Yadav: గతంలో స్పానిష్ చిత్రాలు చేశా.. ఇప్పుడు రాజుయాదవ్ తీశా
ABN, Publish Date - May 14 , 2024 | 09:20 PM
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా ఆరంగేట్రం చేసిన చిత్రం 'రాజు యాదవ్'. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే 17న విడుదల నేపధ్యంలో దర్శకుడు చిత్ర విశేషాలని పంచుకున్నారు.
బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (GETUP SRINU) హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' (Raju Yadav)తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ (Charisma Dreams Entertainment) బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజుయాదవ్ మే 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు కృష్ణమాచారి (Krishnamachary) విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీ నేపధ్యం గురించి చెప్పండి?
మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాను. దీంతో పాటు ఒక స్పానిస్ ఫిల్మ్, మరిన్ని కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. దర్శకుడిగా 'రాజు యాదవ్' నా తొలి చిత్రం.
'రాజు యాదవ్' కాన్సెప్ట్, స్మైల్ క్యారెక్టరైజేష్ గురించి ?
దాదాపు 90శాతం మనుషుల్లో ఎదో ఒక చిన్న లోపం వుంటుంది. ఈ కథకు ఒక లోపం వున్న పాత్ర కావాలి. ఈ తరహాలో కొత్త క్యారెక్టరైజేషన్ చెప్పాలని భావించాను. అలాంటి సమయంలో రాజేంద్రప్రసాద్ గారు, అలీ గారు నటించిన ఓ సినిమాలో కోటి రూపాయిలు లాటరీ టికెట్టు తగిలితే నవ్వుతూనే చనిపోయిన ఓ సీన్ వుంటుంది. సినిమా అంతా అలా నవ్వుతూనే ఉంటాడు. అది నా మైండ్ లో బాగా రిజిస్టర్ అయ్యింది. అలాగే ప్రముఖ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి చిన్నప్పుడు ఎదో సర్జరీ జరిగింది. దాని కారణంగా ఆయన మొహం ఎప్పుడూ నవ్వుతూవున్నట్లే కనిపిస్తుంది. తన నవ్వు వెనుక వున్న రహస్యాన్ని ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ఇలాంటి లోపంతో క్యారెక్టరైజేషన్ రాసుకుంటే బావుంటుందనిపించింది. చాలా ఫన్ జనరేట్ అయ్యే పాత్ర ఇది.
ఈ కథకి ఏదైనా సినిమాల స్ఫూర్తి ఉందా ?
ముందుగా చెప్పినట్లు క్యారెక్టరైజేష్ లో స్ఫూర్తి తప్పితే ఈ కథకి సంబధించి ఏ సినిమాని స్ఫూర్తిగా తీసుకోలేదు. సహజత్వం కూడకున్న సినిమాలంటే ఇష్టం. రాజు యాదవ్ కూడా రియలిస్టిక్ గా వుంటుంది. అన్నీ రియల్ లోకేషన్స్ షూట్ చేశాం.
రాజు యాదవ్ కోసం గెటప్ శ్రీను ని తీసుకోవడానికి కారణం ?
రాజు యాదవ్ వెరీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్. కథ రాసుకున్న తర్వాత ఒకరిద్దరి హీరోలతో వర్క్ షాప్ నిర్వహించాం. ఎందుకో నాకు నమ్మకం కుదరలేదు. పాత్రలో జీవిస్తున్నట్లు అనిపించలేదు. ఒక మంచి ఆర్టిస్ట్ కోసం వెదకడం మొదలుపెట్టాను. అప్పుడు గెటప్ శ్రీను గారు ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. తను ఇప్పటివరకూ కామెడీ కోణంలోనే కనిపించారు కానీ.. నిజానికి ఆయన చాలా ప్రతిభావంతుడైన నటుడు. అన్ని రకాల పాత్రలని చేయలడు. ఈ సినిమా చూసిన తర్వాత తను సౌత్ ఇండియా లో ఒక బెస్ట్ యాక్టర్ అని ప్రేక్షకులు చెబుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో వుంటుంది. రాజు యాదవ్ గెటప్ శ్రీను కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ పాత్రలో ఆయన జీవించారు. ఇది మన స్నేహితుడి కథ, మన కథలా సహజంగా వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ.
చంద్రబోస్ గారి రాసి పాడిన పాటకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది కదా.. దాని గురించి ?
ఈ కథలో రాసినప్పుడు ఆ సిట్యువేషన్ కి చంద్రబోస్ గారితో ఎలాగైనా పాట రాయించాలని అనుకున్నాం. ఆయన అద్భుతంగా రాశారు. లిరిక్స్ స్వయంగా పాడి వినిపించారు. నాకు, సంగీత దర్శకుడు హర్షవర్షన్ రామేశ్వర్ కి బోస్ గారు పాడింది చాలా బావుందనిపించింది. ఆయనతోనే పాడించాలని అనుకున్నాం. అయితే ఆయన మాత్రం సాహిత్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. నా వాయిస్ సరిగ్గా కుదరకపొతే వేరే సింగర్ తో పాడించాలని చెప్పారు. ఫైనల్ గా ఆయన పాడింది రికార్డ్ చేశాం. అవుట్ పుట్ పై ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. లిరిక్స్ లోని ఎమోషన్ ఆయన గొంతులో చాలా అద్భుతంగా పలికింది.
హర్ష వర్ధన్ రామేశ్వర్ వుండగా.. సురేష్ బొబ్బిలి గారితో నేపధ్య సంగీత చేయడానికి కారణం ?
హర్ష వర్ధన్ రామేశ్వర్ గారు చాలా అద్భుతమైన పాటలని స్వరపరిచారు. యానిమల్ కి ముందే పాటలన్నీ ఇచ్చేశారు. యానిమల్ విడుదలైన తర్వాత ఆయన చాలా బిజీ అయ్యారు. సురేష్ బొబ్బిలి కూడా నాకు మంచి స్నేహితుడు. ఆయనతో నేపధ్య సంగీతం చేయించాం. ఆయన నేపధ్య సంగీతం ఎమోషన్ ని మరో స్థాయికి తీసుకెళుతుంది.
గెటప్ శ్రీను గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
గెటప్ శ్రీను డైరెక్టర్స్ ఆర్టిస్ట్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఈ సినిమాతో ఆయన మరో స్థాయికి వెళ్తారు.
హీరోయిన్ పాత్ర గురించి ?
ఇందులో హీరోది అండర్ రేటెడ్ పాత్ర. హీరోయిన్ పాత్ర గ్లామరస్ గా ఉంటుంది. తను చాలా చక్కని నటన కనపరిచారు.
నిర్మాతల గురించి ?
ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. టీం అందరం హ్యాపీగా ఉన్నాం.
భవిష్యత్ లో ఎలాంటి కథలు చేయాలనుకుంటున్నారు ?
సహజత్వంతో కూడుకున్న కథలే ఇష్టం. తెరపై చూస్తున్నపుడు ఇది మన కథే అని ప్రేక్షకులు ఫీలయ్యేలా కథలు చేయాలని ఉంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
కొన్ని కథలు వున్నాయి. అయితే ప్రస్తుతం నా ద్రుష్టి ఈ సినిమా విడుదలపై ఉంది