Nandamuri Balakrishna: తెలంగాణలో ‘బాలకృష్ణ ఫిలిం స్టూడియో’.. నిజమేనా?
ABN, Publish Date - Oct 26 , 2024 | 08:19 PM
నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా శనివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. అప్పుడే ఈ వార్తలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విషయంలోకి వస్తే..
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలంగాణలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా శనివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ కేబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేలా ఒకటే వార్తలు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది.. తెలంగాణ కేబినెట్ భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (Balakrishna Film Studio)
Also Read-NBK: అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై బాలయ్య.. కానీ ఈ లుక్ ఏ సినిమాలోదో కనిపెట్టారా?
అక్కినేని నాగేశ్వరరావు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ భూములు పొందారు. స్టూడియో 1976లో ప్రారంభించబడింది. దాదాపు అదే సమయంలో, ఎన్టీఆర్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ దగ్గరలో రామకృష్ణ సినీ స్టూడియోని నిర్మించారు. ‘దాన వీర శూర కర్ణ’ షూటింగ్‌తో రామకృష్ణ సినీ స్టూడియో ప్రారంభమైంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు తమిళ లెజెండ్ ఎంజిఆర్ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత, నెమ్మదిగా ఆ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా మారింది. ‘దాన వీర శూర కర్ణ’ నిర్మించే నాటికి అది ఒక చిన్న స్టూడియో. అక్కడ భూమి అందుబాటులో లేకపోవడంతో విస్తరణ కష్టంగా మారింది. ఆ తరువాత ఎన్టీఆర్ నాచారంలో పెద్ద స్టూడియో నిర్మించారు. దీనికి రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియో అని పేరుంది. అక్కడ పౌరాణిక సినిమాల షూటింగ్‌కు అనువైన శాశ్వత సెట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు స్టూడియోలలో ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమా షూటింగ్‌లు మాత్రమే జరిగాయి.
Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, స్టూడియో ఆయన సభా వేదికగా మారింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ కూడా స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే ఈ వార్తలు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయో.. ఈ స్టూడియోపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బాలయ్య స్టూడియో ఏంటి? ఏపీలో కట్టుకోవచ్చు కదా.. అంటూ కొందరు తెలంగాణవాదులు కామెంట్స్ చేస్తున్నారు.