Cinema Tree: సినిమా చెట్టుగా గుర్తింపు.. వయసు 150 ఏళ్లకు పైగానే!
ABN, Publish Date - Aug 05 , 2024 | 05:14 PM
గోదారి గట్టున అదొక భారీ వృక్షం.. (Cinema Tree) ఎంతోమందికి నీడను ఇచ్చింది.. ఎన్నో సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అయింది.. దశాబ్ధాలుగా ఆ చెట్టు నీడన ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.. ఇప్పుడు ఆ వృక్షరాజం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
గోదారి గట్టున అదొక భారీ వృక్షం.. (Cinema Tree)
ఎంతోమందికి నీడను ఇచ్చింది..
ఎన్నో సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అయింది..
దశాబ్ధాలుగా ఆ చెట్టు నీడన ఎన్నో సినిమాలు తెరకెక్కాయి..
ఇప్పుడు ఆ వృక్షరాజం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
150 ఏళ్ల జీవిత కాలంలో 300లకు (Tree in 300 Movies) పైగా సినిమాల్లో కనిపించి.. హీరో హీరోయిన్ల రొమాన్సుకు, బావా మరదళ్ల సరసానికి, తాతా మనవరాళ్ల ఆప్యాయతకు, డైరెక్టర్ క్రియేటివిటీకి, కెమెరామెన్ పనితనానికి సాక్షిగా నిలిచింది. దాసరి, విశ్వనాథ్, బాపు, కృష్ణవంశీ, వంశీ , సుకుమార్ ఇలా అనేక మంది ప్రముఖ డైరెక్టర్లు ఈ చెట్టు వద్ద తమ సినిమా షూటింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరకూ ఎందరో హీరోల సినిమాల్లో ఈ చెట్టు భాగం అయ్యింది. వంశీ, కె.రాఘవేంద్రరావు వంటి ఎందరో దర్శకులకైతే ఈ చెట్టు ఓ సెంటిమెంట్. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ చెట్టు సోమవారం తెల్లవారుజామున నేల కూలింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో కుమారదేవం గ్రామంలో గోదావరి గట్టున ఉండే ఈ వృక్ష రాజం నీడన ఎన్నో దశాబ్దాలుగా చాలా సినిమాల షూటింగులు జరిగాయి. తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో ఈ చెట్టు కనిపించాలని ప్లాన్ చేసేవారు. గోదావరి నది గట్టున ఉన్న సింగలూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ నిద్రగన్నేరు చెట్టును సుమారుగా 150 ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెబుతుంటారు.
ఈ చెట్టు కింద సినిమా షూట్ చేేస్త సూపర్ హిట్టే. అందుకే అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు కూడా ఇక్కడికి వచ్చేవారు. 1974లో వచ్చిన 'పాడిపంటలు’ చిత్రంలో 'ఇరుసులేని బండి ఈశ్వరుని బండి’ పాట నుంచి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం 'సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో 'సమయానికి’ పాట నుంచి గోదావరి చిత్రంలో ఉప్పొంగేలే గోదావరి’ లాంటి వందలాది పాటల రూపంలో జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. 'పాడిపంటలు' సినిమా నుంచి ఇంకా రిలీజ్ కాని రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్’ వరకు ఈ సినిమా చెట్టు ఓ ఐకాన్ సింబల్.
మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, ఆపద్భాందవుడు, నువ్వు లేక నేను లేను, రంగస్థలం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించిందీ ఈ సినిమా చెట్టు. వంశీ దర్శకత్వంలో వచ్చినా 18 చిత్రాల షూటింగ్ ఈ చెట్టు ప్రాంగణంలో చేశారు. గోదావరి వరద ఉధృతికి దెబ్బతినకుండా ఈ చెట్టు చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్థి చేయాలని ప్రకృతి ప్రేమికులు అధికారులను కోరారు. అయితే గోదావరి పోటు ఉదృతంగా ఉండడంతో గట్టు తెగి ఈ చెట్టు నేల కూలిందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఈ చెట్టు గురించి తెలిసిన గోదావరి వాసులు సోషల్ మీడియాలో సినిమా చెట్టుతో తమకున్న అనుభవాలను, నేల కూలిపోవటంపై అవేదనను వ్యక్తం చేస్తున్నారు.