Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. జనసేన పార్టీ నుంచి సస్పెండ్

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:18 PM

జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. తక్షణమే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది.

jani

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయనపై అత్యాచారం కేసు నమోదవ్వడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రీయాశీలకంగా పనిచేస్తుండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది. ఈమేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది.వేములపాటి అజయ్‌ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆయన మద్దతు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు.


జానీ మాస్టర్‌పై ఆరోపణలు..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లో ఓ ఛానల్‌లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైనట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఉండాలంటూ ఆయన టీమ్ యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీమ్‌‌లో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాదు షూటింగ్ సమయాల్లో అతడు చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం చేశారని ఆమె ఆరోపించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశారని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్శిల్ వచ్చిందని.. పేరు లేకుండా తన ఇంటి తలుపునకు వేలాడదీయబడిందని.. దాని లోపల ‘‘Congratulations for son be care full’’ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది.


కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్

జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. ఈ వ్యవహారంలో కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ అయింది. ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయగా, తాజాగా రేపు (మంగళవారం రోజున) కొరియోగ్రాఫర్ అసోషియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఆసోషియేషన్‌కు జానీ మాస్టర్ ప్రెసిడెంట్‌గా ఉండ‌గా సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతోఈ సమావేశం రేపటికి వాయిదా ప‌డింది. రేపు ఈ స‌మావేశంలో జానీ మాస్టర్ పై అసోసియేషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇదిలాఉండ‌గా యూనియన్ బై లాస్ ప్రకారం జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Sep 16 , 2024 | 05:18 PM