Malavika Mohanan: మా అమ్మ తర్వాత ప్రభాసే
ABN, Publish Date - Aug 18 , 2024 | 12:23 PM
‘పేట’, ‘మాస్టర్’ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహనన్. మలయాళం చిత్రాలతో కెరీర్ ప్రారంభించి, తమిళంలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ, త్వరలోనే ‘రాజా సాబ్’తో తెలుగులోనూ అడుగుపెట్టనుందీ భామ.
‘పేట’, ‘మాస్టర్’ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంది మాళవిక మోహనన్(Malavika Mohanan). మలయాళం చిత్రాలతో కెరీర్ ప్రారంభించి, తమిళంలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ, త్వరలోనే ‘రాజా సాబ్’తో (The Raja Saab) తెలుగులోనూ అడుగుపెట్టనుందీ భామ. ఇటీవల ‘తంగలాన్’లో (Thangalan) వైవిధ్యమైన పాత్రను పోషించిన ఈ మల్లూ బ్యూటీ చెబుతున్న ముచ్చట్లివి...
ఆచితూచి ఎంపిక
చాలామంది నన్ను చూసి ఏ కొత్త హీరోయినో అనుకుంటారు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతోంది. తమిళం, మలయాళం, హిందీలో దాదాపు పది సినిమాల్లో నటించా. నా అభిమాన కథానాయికలు శోభన, ఊర్వశి, కాజోల్, మాధురి దీక్షిత్‌లాగా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించాలన్నదే నా కోరిక. అందుకే ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నా. రూ. 500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నా పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తా.
అనుకోని అవకాశం
నేను పుట్టింది కేరళలోనైనా, పెరిగింది ముంబైలో. మా నాన్నగారి వృత్తిరీత్యా చిన్నప్పుడే మేము ముంబైకి మకాం మార్చాం. మా నాన్న ఎవరోకాదు... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్. ఓ రోజు ఆయన నా అభిమాన నటుడు మమ్ముట్టితో కలిసి ఒక యాడ్ షూట్ చేస్తున్నారని తెలిసి... నేనూ వెళ్లాను. మమ్ముటి సర్ నన్ను చూసి వాళ్లబ్బాయి దుల్కర్ సల్మాన్ సినిమా ‘పట్టం పోల్’(2013) కోసం నన్ను హీరోయిన్‌గా అడిగారు. అలా మమ్ముటి సర్ వల్లే ఈరోజు మీ ముందు ఉండగలిగా.
మా ఇద్దరి ఆలోచనలు ఒకటే...
విజయ్, నేను కలిసి ‘బాఘీ -3’ సినిమా చూశాం. అందులో టైగర్ ష్రాఫ్ ఎంట్రీ సీన్ రాగానే విజయ్ ఆనందంతో ‘తలైవా’ అంటూ గట్టిగా అరిచారు. అప్పుడు అర్థమైంది ఆయనకు టైగర్ ష్రాఫ్ అంటే ఎంత ఇష్టమనేది. ఆయన ఏదైన మాట ఇస్తే చాలు.. ఆరు నూరైనా దాన్ని నెరవేర్చుతారు. ఇక ధనుష్, నేను కలిసి ‘మారన్’ సినిమా చేశాం. దాదాపు మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ధనుష్ యాక్టింగ్‌లో మాస్టర్. ఏ సన్నివేశాన్ని అయినా ఇంకా బాగా ఎలా చేయొచ్చో నాకు సలహాలు ఇస్తుండేవారు.
ఫొటోగ్రఫీ ఇష్టం
నాకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే అమితమైన ప్రేమ. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు తమిళనాడు, కేరళ, కర్ణాటక పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో సరదాగా తిరుగుతూ వన్యప్రాణులను కెమెరాలో బంధిస్తుంటా. ఇటీవల ఆఫ్రికా సందర్శనకు వెళ్లా. అక్కడ టాంజానియాలోని సెరెంగీటి నేషనల్ పార్క్ , కెన్యాలోని మాసాయి మారా నేషనల్ రిజర్వ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఒక చిరుత జింకపిల్లను వేటాడటాన్ని కళ్లారా చూశా. వెంటనే ఆ చిరుత జింక తలను నోట పట్టి తినడాన్ని నా కెమెరాలో రికార్డు చేశా.
బెస్ట్ ఫుడ్
‘రాజా సాబ్’ షూటింగ్ సమయంలో ప్రభాస్ నాకు ఫుడ్ పంపించారు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న వాటిలో బెస్ట్ అంటే ప్రభాస్ సర్ పంపించిందే. ఆయన పాన్ వరల్డ్ స్టార్ అయినా సరే.. సెట్‌లో అందరితో చాలా సరదాగా ఉంటారు. ఆయన సింప్లిసిటీకి ఎవరైనా ఆకర్షితులవ్వాల్సిందే.
తప్పలేదు...
‘తంగలాన్’ సినిమా షూటింగ్‌లో నాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఒకరోజు నేను సెట్‌కు వెళ్లేసరికి ఓ పెద్ద గేదె ఉంది. డైరెక్టర్ పా.రంజిత్ వచ్చి ఆ గేదెపై ఎక్కగలవా? అని అడిగారు. ఏదో సరదాగా అన్నారనుకున్నా. కానీ మేకప్ పూర్తయిన తర్వాత ఆ గేదెపై కూర్చోమన్నారు. చేసేదేమీ లేక గుండె గుబేలుమంటున్నా సరే ఏదోలా షూట్ పూర్తి చేశా. దాదాపు నాలుగైదు గంటలు మేకప్‌కు వెచ్చించాల్సి వచ్చేది. ఆ మేకప్, టాటూ, కాస్ట్యూమ్, విగ్‌తోనే దాదాపు పది గంటలపాటు ఉండేదాన్ని. పైగా మండే ఎండల్లోనే షూటింగ్ చేశాం. దాంతో నా శరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి. రోజూ సెట్స్‌లో డెర్మటాలజిస్ట్, ఐ డాక్టర్... ఇలా ఐదుగురు డాక్టర్లు ఉండేవారు. నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని అనుభవాలను మిగిల్చిన సినిమా.
మహేశ్‌తో ఛాన్స్ కోసం..
మా నాన్న ‘మహర్షి’ చిత్రానికి పనిచేశారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ రోజు నాన్నతో కలిసి షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ మహేశ్‌ను కలిసే అవకాశం దక్కింది. ఎంతో ఫ్రెండ్లీగా పలకరించారు. మహేశ్‌తో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా. నాకు ఇష్టమైన హీరో ఫహద్ ఫాజిల్.