Faria abdullah: త్రిష కోసమే ఆ సినిమా చూశా...
ABN, Publish Date - Mar 17 , 2024 | 05:36 PM
‘జాతిరత్నాలు’లో ‘చిట్టి’ని ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రకు ఇటీవలే ఉత్తమనటిగా ‘గామా’ అవార్డు కూడా అందుకున్న ఫరియా అబ్దులా స్పెషల్ సాంగ్‌లోనూ తళుక్కుమంది. తాజాగా ‘ఆ... ఒక్కటీ అడక్కు’ చిత్రంతో అల్లరి నరేష్‌తో కలిసి గిలిగింతలు పెట్టడానికి సిద్ధమైంది.
‘జాతిరత్నాలు’లో ‘చిట్టి’ని ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రకు ఇటీవలే ఉత్తమనటిగా ‘గామా’ అవార్డు కూడా అందుకున్న ఫరియా అబ్దులా స్పెషల్ సాంగ్‌లోనూ తళుక్కుమంది. తాజాగా ‘ఆ... ఒక్కటీ అడక్కు’ చిత్రంతో అల్లరి నరేష్‌తో కలిసి గిలిగింతలు పెట్టడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ హైదరాబాదీ భామ పంచుకున్న ముచ్చట్లివి...
సరదాగా చెబితే...
‘జాతిరత్నాలు’ విడుదలైన తర్వాత తమాషా సంఘటన ఎదురైంది. ఒకసారి నేను క్యాబ్‌లో వెళ్తున్నా. డ్రైవర్ కాస్త డల్‌గా ఉండటంతో ఏమైందని అడిగా. తన చిన్నప్పటి క్రష్ పేరు చిట్టి అని, తను గుర్తొచ్చిందని చెప్పాడు. తన బాధను పోగొట్టాలని సరదాగా నా పేరు కూడా చిట్టి అని చెప్పా. ఇంకేముంది ఆయన క్రష్, నేను ఒకరే అనుకొని వెంటనే కారు ఆపేసి ‘మీ స్కూల్ పేరు ఏంట’ని అడిగేశాడు. దాంతో నా అసలు పేరు చెప్పి, ‘జాతిరత్నాలు’ సినిమాలో నా పాత్ర పేరు చిట్టి అని చెప్పడంతో డ్రైవర్ నవ్వేశాడు.
చిలిపి దొంగతనం
చిన్నప్పుడు నేను చాలా నాటీ. ఓసారి స్నేహితులందరం కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లి చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ తీసుకొని ఎవరి కంటపడకుండా బ్యాగ్‌లో పెట్టుకొని వచ్చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. అనుకున్నట్టుగానే నేను చాక్లెట్స్ తీసుకుని గబగబా వచ్చేశాను. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం పాపం అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన ఇప్పటికీ గుర్తు చేసుకొని మరీ నవ్వుకుంటాం.
మర్చిపోలేని అనుభూతి
నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా సోలోగా వెళ్లడానికే ఇష్టపడతా. ఇతర ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడమంటే ఆసక్తి. ఇప్పటికే మన దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టొచ్చేశా. కానీ మొదటి విదేశీ ప్రయాణం మాత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రయిబ్’ సినిమా వల్లే జరిగింది. థాయిలాండ్‌లో చేసిన పాట చిత్రీకరణ నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.
ఎన్నిసార్లు చూశానో...
చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ‘వర్షం’. అందులో త్రిష నటన చూసి ఆమెకు ఫ్యాన్ అయిపోయా. ఆ తర్వాత త్రిష కోసమే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమా చూశా. అది కూడా నాకు భలే నచ్చింది. ఎంతలా అంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో కూడా లెక్కలేదు.
ప్రయోగాలు ఇష్టం
నేను చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా. నటిగా నా జర్నీపై నాకో స్పష్టత ఉంది. ఛాన్స్‌లు వస్తాయా, రావా అనే భయం కూడా లేదు. అలాగే నాకు ప్రయోగాలు చేయడంటే ఇష్టం. యాక్షన్, పీరియాడిక్ పాత్రలతో పాటు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఇష్టం. దర్శకత్వ ఆలోచన కూడా ఉంది. అయితే దానికి ఇంకాస్త సమయం పడుతుంది.
బన్నీ డ్యాన్స్ సూపర్బ్
నాకు డ్యాన్స్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. హిప్ హాప్, బెల్లీ డ్యాన్స్, ఫ్రీ స్టయిల్ డ్యాన్సింగ్ లాంటి పాశ్చాత్య నృత్యాలతో పాటు కథక్ కూడా నేర్చుకున్నా. డ్యాన్స్‌లో నాకు స్ఫూర్తి మాత్రం ప్రసిద్ధ బెల్లీ డ్యాన్సర్ మెహర్ మాలిక్. టాలీవుడ్‌లో ఫేవరెట్ డ్యాన్సర్ బన్నీ. ముఖ్యంగా ‘రేసుగుర్రం’ సినిమాలోని ‘సినిమా చూపిస్త మామ’ పాటంటే నాకు పిచ్చి. అందులో బన్నీ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ సూపర్బ్ అంతే.
నా హ్యాండ్ బ్యాగ్‌లో...
స్కిన్‌కేర్ విషయంలో కాస్త కఠినంగానే ఉంటా. నీళ్లు ఎక్కువగా తాగుతా, పండ్లు, తాజా పండ్ల రసాలు తరుచుగా తీసుకుంటా. నా ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో. వేసవిలో తెగ తింటా. అలాగే కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. నా హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడూ మొబైల్, లిప్‌బామ్, సన్‌స్ర్కీన్ లోషన్ ఉండాల్సిందే.