Indra Movie: ఈ కానుక అమూల్యం.. ఈ జ్ఞాపకం అపురూపం
ABN, Publish Date - Aug 24 , 2024 | 05:58 PM
నిర్మాత అశ్వనీదత్‌కు మెగాస్టార్ చిరంజీవి విలువైన కానుక అందజేశారు. ‘ఇంద్ర’ రీ రిలీజ్‌ను పురస్కరించుకుని చిత్ర బృందాన్ని శుక్రవారం చిరు కలిశారు.
నిర్మాత అశ్వనీదత్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)విలువైన కానుక అందజేశారు. ‘ఇంద్ర’ రీ రిలీజ్‌ను పురస్కరించుకుని చిత్ర బృందాన్ని శుక్రవారం చిరు కలిశారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్(B Gopal), సంగీత దర్శకుడు మణిశర్మ, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, చిన్నికృష్ణ ను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. ఆ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు. అశ్వనీదత్‌కు (Ashwini Dutt) చిరు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్వనీదత్ ట్వీట్ చేశారు.
‘ఇంద్ర’ (Indra) చిత్ర బృందాన్ని కలవడంపై చిరు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ 22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజైన సందర్భంగా చిరు సత్కారం. నిర్మాత బి.గోపాల్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, చిన్నికృష్ణలతో కలిసి సినిమా మేకింగ్ విశేషాలను నెమరు వేసుకోవడం జరిగింది’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘ఈ విజయశంఖాన్ని కానుకగా మీరు ఇచ్చారు. కానీ, ఇంద్రుడై, దేవేంద్రుడై దానిని పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం’’ అని పేర్కొన్నారు. ‘‘ఇంద్ర’ సినిమా నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కాలం మారిపోతుంది. తరాలు మారిపోతాయి. ఒక్కరు మాత్రమే కాలానికి ఎదురీది.. తరాలను దాటి.. శాశ్వతంగా నిలిచి పోరాటం చేస్తారు. అలాంటి వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నిర్మించడం నా అదృష్టం. థాంక్యూ చిరు. త్వరలో మీతో ఐదో చిత్రం కూడా నిర్మిస్తా అని మాటిస్తున్నా’’ అని ఇటీవల ‘ఇంద్ర’ రీ రిలీజ్‌ను ఉద్దేశించి అశ్వనీదత్ చెప్పారు.