Chiranjeevi: పుష్పకి మెగా ఆశీస్సులు.. చిరంజీవి

ABN, Publish Date - Dec 05 , 2024 | 07:16 PM

ఎట్టకేలకు అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీకి మెగా ఆశీస్సులు లభించాయి. తాజాగా ఆయనను పుష్ప మూవీ టీమ్ కలిసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూల్ చేస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో తన సత్తా చాటిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘పుష్ప 2’‌తో మరోసారి తన పవర్‌ని బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తున్నారు. అయితే మెగా వర్సెస్ అల్లు రచ్చతో ఈ సినిమాపై కాస్త నెగిటివ్ ఇంప్యాక్ట్ పడిన విషయం వాస్తవమే. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక్షంగా, నాగ బాబు పరోక్షంగా ఈ సినిమాకి మద్దతు తెలపగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందించినట్లు తెలుస్తోంది.


తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, సీఈఓ చెర్రీ, పుష్ప డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ ని కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వాళ్ళు 'పుష్ప 2'ని ప్రమోట్ చేయమని చెప్పడానికే వెళ్ళారా వేరే ఉద్దేశంతో వెళ్ళారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే రిలీజైన పీక్ డేనే నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్, సీఈఓ చెర్రీ కూడా మెగా స్టార్ ని కలిశారంటే తప్పకుండ సినిమా గురించే అని అంతా భావిస్తున్నారు. అలాగే వారి కోరికకి మెగాస్టార్ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. సో, ఎట్టకేలకు అల్లు అర్జున్ కి మెగా ఆశీస్సులు లభించినట్లు అయ్యింది.


మరోవైపు ఈ మూవీలోని కొన్ని డైలాగులు వివాదాలకు ఆజ్యం పోశాయి. ఈ సినిమాలో "ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికీ, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్" అనే డైలాగ్ వైరల్‌గా మారింది. ఈ డైలాగ్ తో డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను టార్గెట్ చేశాడా అనే అనుమానులు రేకెత్తుతున్నాయి. దీంతో మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ వచ్చింది.

Updated Date - Dec 05 , 2024 | 07:16 PM