Rachna Banerjee: ఎంపీగా గెలిచిన చిరంజీవి హీరోయిన్.. తొలి ప్రయత్నంలోనే రికార్డు
ABN, Publish Date - Jun 05 , 2024 | 11:53 AM
తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బెంగాలీ నటి రచన బెనర్జీ తొలి ప్రయత్నంలోనే అక్కడి రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది.
తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బెంగాలీ నటి రచన బెనర్జీ (Rachna Banerjee) అక్కడి రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే మరో నటి బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై (Locket Chatterjee) 70 వేల ఓట్ల మెజార్టీ తేడాతో విజయం సాధించి వార్తల్లో నిలిచింది. బెంగాలీలో సుమారు 200 వరకు చిత్రాల్లో నటించిన రచన ఓడియాలోనూ ఎక్కువ చిత్రాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలోనూ నటించింది. గతంలోనూ తెలుగు సినిమాల్లో నటించిన నవనీత్ రానా మహారాష్ట్ర అమరావతి నుంచి ఎంపీగా గెలిచిన విషయం అందరికి తెలిసిందే.
తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన నేను ప్రేమిస్తున్నాను అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రచనా బెనర్జీ ఇక్కడ డజన్‌కు పైగానే చిత్రాలు చేసింది. వీటిలో చిరంజీవితో బావగారు బాగున్నారా, బాలకృష్టతో సుల్తాన్ వంటి సినిమాలతో పాటు కన్యాదానం, పిల్ల నచ్చింది, ఎస్పీ కృష్టారెడ్డి అభిషేకం చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో చివరగా 2002లో వచ్చిన లాహిరి లాహిరిలో సినిమాలో సుమన్ సరసన నటించిన రచన ఆ తర్వాత తెలుగులో కనిపించ లేదు. తన రాష్ట్రంలో సినిమాలు, టీవీ షోలతో బీజీ అయింది.
దీదీ నెం1 అనే టెలివిజన్ షోతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న రచన రెండు మూడు నెలల క్రితమే సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి సంచలనం సృష్టించింది. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో హూగ్లీ (Hooghly) నియోజకవర్గం నుంచి బరిలో నిలిచింది. ఈ క్రమంలో తన ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీపై 70 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం విశేషం.