Pawan Kalyan - Bunny Vasu: సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు సంప్రదించు అన్నారు
ABN, Publish Date - Jul 19 , 2024 | 08:43 PM
మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయా? ఈ ప్రశ్నపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. తాజాగా ఆయన నిర్మించిన ‘ఆయ్’ సినిమా థీమ్ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మెగా, అల్లు ఫ్యామిలీల (Mega - Allu Familys) మధ్య విభేదాలున్నాయా? ఈ ప్రశ్నపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu)స్పందించారు. తాజాగా ఆయన నిర్మించిన ‘ఆయ్’ (Aay)సినిమా థీమ్ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జరిగిన ఎన్నికలకు ముందు.. వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని ఉద్దేశిస్తూ ఓ విలేకరి ప్రశ్నించగా బన్నీ వాస్ స్పందించారు.
‘‘మెగా, అల్లు ఫ్యామిలీ ని నేను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి ప్రతి క్షణం కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. అంతమంది స్టార్‌లను తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఏ కుటుంబంలో నైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తుంటాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్ చేయడం మంచి పద్థతి కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి తెలుసు కాబట్టే.. నమ్మకంగా చెబుతున్నా. ‘మేమంతా ఒక్కటే’ అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే! ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్’’ అని అన్నారు.
పాలకొల్లు ఎమ్మెల్యే టికెట్ గురించి పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) అడిగారా? అనే ప్రశ్నకు బన్నీ వాసు జవాబిచ్చారు. ‘‘2019లోనేపాలకొల్లు నుంచి నన్ను పోటీ చేయమన్నారు. ‘అప్పుడే వద్దు సర్. కొంత టైమ్ కావాలి’ అని అడిగా. నువ్వు అలా ఆలోచించొద్దు. ఓడిపోయినా ఫర్వాలేదు. భయపడకు. ఏదేమైనా ముందడుగేయ్ అని ధైర్యం చెప్పారు. కానీ, నేను ధైర్యం చేయలేకపోయా. 2024 ఎన్నికలకు ముందు కలిసినప్పుడు ఇంకా టైమ్ తీసుకుంటావా? అని అడిగారు. అల్లు అరవింద్ సర్‌తో మాట్లాడి చెబుతా అని సమాధానమివ్వగా ఆయనకు నా అభిప్రాయం అర్థమైంది. ఎప్పుడైతే నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు నన్ను సంప్రదించు అన్నారు’’ అని బన్నీ వాసు చెప్పారు.