Bhumika: నిర్మాతల ఒత్తిడితో.. మణిరత్నం మూవీ వదులుకున్నా
ABN, Publish Date - Oct 29 , 2024 | 12:04 PM
పలువురు నిర్మాతల ఒత్తిడి కారణంగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్టు సీనియర్ నటి భూమిక వెల్లడించింది. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
పలువురు నిర్మాతల ఒత్తిడి కారణంగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని వదులుకున్నట్టు సీనియర్ నటి భూమిక (Bhumika Chawla) వెల్లడించింది. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘నేను తమిళం, తెలుగులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు మణిరత్నం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తారా? అని అడగ్గా సరేనని చెప్పాను.
అయితే, అది ఓ బిడ్డకు తల్లిపాత్ర. ఆ సమయంలో తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ విషయాన్ని నిర్మాతలకు చెప్పగా, వారు అంగీకరించలేదు. హీరోయిన్గా అయితే, ఫర్లేదు కానీ, తల్లి పాత్రలో చేయడం వల్ల తమ చిత్రాల బిజినెస్‌పై ప్రభావం చూపుతుందని, అందువల్ల ఆ ఆఫర్‌ను తిరస్కరించాలని కోరారు.
ఈ కారణంగా మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయాను. ఆ చిత్రమే ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ తెలుగులో అమృతగా వచ్చింది. ఆ సినిమాలో నేను నటించాల్సిన పాత్రలో సిమ్రన్ నటించారు. ఈ మంచి అవకాశం చేజారిపోయిందనే బాధ ఇప్పటికీ నాలో ఉంది’ అని భూమిక ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూమిక జయం రవి నటించిన తమిళ చిత్రం బ్రదర్‌లో కీలక పాత్ర పోషించగా.. ఆ సినిమా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.