Breaking News: బాలయ్యకి పద్మ భూషణ్.. విషయం ఏమిటంటే
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:39 AM
బాలయ్యకి పద్మ భూషణ్.. వింటుంటే నందమూరి అభిమానులకు పండగ వచ్చినట్లు ఉంది కదా.. అవును త్వరలో బాలయ్యకు ఈ పురస్కారం రాబోతోందని తెలుస్తోంది. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఈ వార్తలోని విషయం ఏమిటంటే..
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ (Padma Bhushan)కు నామినేట్ అయ్యారు. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ నిమిత్తం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నామినేట్ అయిన వారి నుండి విజేతలను జనవరి 26 రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ప్రకటిస్తారు.
Also Read- NBK109: బాలయ్య 109 సినిమా టైటిల్ ఇదే.. మరో బ్లాక్‌బస్టర్
బాలయ్య విషయానికి వస్తే.. లెజెండ్ నందమూరి తారక రామారావు (NT Ramarao) నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నట వారసుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి టాలీవుడ్ చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్‌గా బాలయ్య సేవలు నిత్యం కొనియాడబడుతుంటాయి. అతి తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా, ప్రజా ప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలయ్య.
ఈ నేపథ్యంలో బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తోన్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికిగానూ బాలయ్యను ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. వాస్తవానికి ఆయనకి ఈ అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండగా.. చాలా ఆలస్యమైందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ప్రకటించే పద్మ అవార్డులలో బాలయ్య పేరు ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో పాటు ఏపీ నుంచి పలువురి పేర్లను ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది.