Jr Ntr: తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. Jr.ఎన్టీఆర్ కోటి విరాళం
ABN, Publish Date - Sep 03 , 2024 | 11:35 AM
ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తమవంతు విరాళం ప్రకటించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది.
అలాగే ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr), మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందిస్తూ తమ సానుభూతి తెలియజేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్ ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా రూ.50 లక్షల విరాళం ప్రకటించగా, విశ్వక్ సేన్ ఆంధప్రదేశ్‌ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం అందజేశారు.
అదేవిధంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు సంయుక్తంగా తమ హారిక, హసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తరుపున ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 లక్షలు, తెలంగాణలకు రూ.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.